అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఉద్యమం నిర్వహిస్తే మద్దతునిచ్చి ఫొటోలు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబు నేడు రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న భూ ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ హజారే దీక్ష చేస్తుంటే పట్టించుకోకపోవడం అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. నాడు అధికారం కోసమే అన్నాదీక్షకు మద్దతు తెలిపారని, నేడు మోడీ భయంతోనే ఢిల్లీ వెళ్లేందుకు జంకుతున్నారన్నారు.

సీపీఐ చిత్తూరు జిల్లా 21వ మహాసభ బుధవారం కాళహస్తిలో ప్రారంభ మైంది.బహిరంగసభలో నారాయణ మాట్లాడుతూ రైతాంగం సుదీర్ఘ కాలం నిర్వహించిన ఉద్యమం ఫలి తంగా 2013లో భూసేకరణ చట్టాన్ని మార్చి రైతులకు అనుకూలంగా తీసుకొచ్చారన్నారు. అయితే, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులఒత్తిడితో దొంగచాటున భూ సేక రణ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆర్డినెన్స్‌ తేవడం రైతులపై దొంగదెబ్బలాంటిదన్నారు. మన రాష్ట్రంలో రాజధాని భూసేకరణ విషయంలో రైతాంగం నుంచి ముఖ్యమంత్రి ప్రతిఘటనలు చవి చూస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్‌ను తొలి అస్త్రంగా ప్రయోగించబోతున్నార న్నారు. రైతాంగంపై ఇలాంటి ప్రయోగం చేస్తే తీవ్రంగా ఉద్యమిస్తామని నారాయణ హెచ్చరించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖరరావు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా ప్రతివారం పారిశ్రామిక, పెట్టుబడిదా రులతోనే సమావేశమవుతూ వారి సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన బాబు కార్మిక నాయకులకు ముఖం చాటేయడం దారుణమన్నారు. రైతుమాఫీపై మొదటి సంతకంగా పేర్కొన్న చంద్రబాబు కేవలం నాలుగు వేల కోట్లు మాత్రం మంజూరు చేసి రైతులకు నేడు బ్యాంకుల నుంచి అప్పులు రాకుండా చేశార న్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేస్తామంటున్న సీఎం రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాలు మూసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రేణిగుంట సీఆర్‌ఎస్‌ సామర్థ్యం పెంచాలని, కరువు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామా నాయుడు అధ్యక్షత వహించగా ఆర్‌ వెంకయ్య స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: