పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కాని అమేథీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశం విడిచి విదేశాలలో విహారానికి వెళ్లారా అనే అంశంపై ఊహా గానాలు సాగుతున్న తరుణంలో, ఆయ న దేశంలోనే ఉన్నారని జగదీశ్‌ శర్మ అనే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త వెల్లడించారు. తన వాదనను బలపరిచేటట్లు ఒక హిల్‌ స్టేషన్‌లో గుడారం పక్కన రాహుల్‌ ఉన్న ఫొటోలను సైతం ట్విట్టర్‌ ద్వారా శర్మ బయటపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ఒక వనంలో రాహుల్‌ బస చేశారని తెలిపారు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్‌ పట్టించుకోవడం లేదంటూ తమ నాయకుడిని అపఖ్యాతి పాల్జేస్తున్నారన్న భావనే తాను రాహుల్‌ గాంధీ అటవీ ప్రాంతంలో మకాం పెట్టిన ఫొటోలను లోకానికి వెల్లడి చేయడానికి కారణం అని శర్మ వివరించడం విశేషం.ఆయనకు కొంత కాలం అవసరం, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దీర్ఘంగా ఆలోచిస్తున్నారుః అని జగదీశ్‌ శర్మ పేర్కొన్నారు. త్వరలో బెంగళూరులో జరగనున్న పార్టీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సన్నద్ధులు అవుతున్నారని కూడా శర్మ తెలిపారు. బెంగళూరు సమావేశాల సందర్భంగా రాహుల్‌ను పార్టీ అధ్యక్ష పదవిలో నియమిస్తారు. ఎవరికైనా దీనిపై అభ్యంతరాలు ఉంటే అటువంటి వారు పార్టీని వీడి వెళ్లవలసి ఉంటుంది అని శర్మ అన్నారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు, ప్రియాంకకు తాను సన్నిహిత మిత్రుడినని శర్మ చెప్పుకొన్నారు.

గాంధీల కుటుంబం సమ్మతితోనే రాహుల్‌ ఫొటోలు విడుదలై ఉంటాయన్న అంచనాలు బయలుదేరాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ ఫొటోలపై వెంటనే ప్రతిస్పందించలేదు. ఆ ఫొటోలు సిసలైనవే అని నిర్ధారించడానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ మీడియా విభాగం నిరాకరించింది. కొన్ని గంటల తరువాత ఆ ఫొటోలు 2008లో తీసినవి అని తెలిపింది. శర్మ చెప్పిన విషయాలు సరైనవి కాదు అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పి.సి. చాకో స్పష్టంచేశారు.

శర్మ పార్టీలో లేరు, గాంధీల కుటుంబంతో ఆయనకు ఎటువంటి బంధం లేదు అని చాకో చెప్పారని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. కీలకమైన బడ్జెట్‌ సమావేశాలకు రాహుల్‌ గాంధీ దూరంగా ఉండడం కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులలోకి నెట్టింది. అయితే, ఆయనకు కొంత కాలం పాటు సెలవు మంజూరైంది.. రెండు వారాల సెలవు ముగిసిన తరువాత ఆయన తిరిగి వస్తారు, పార్టీ విధులు నిర్వహిస్తారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా చెప్పిన విషయం తెలిసిందే. రాహుల్‌ బ్యాంకాక్‌కు గాని, లేదా గ్రీస్‌కు గాని వెళ్లారని అంతక్రితం మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: