తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలా హలం ప్రారంభమైంది. „హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో గెలుపుపై దృష్టి సారించారు.

బీజేపీ హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎన్‌.రామచందర్‌రావును, వరంగల్‌, నల్లగొండ-ఖమ్మం అభ్యర్థిగా రామ్మోహన్‌ను బరిలోకి దింపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసింది మొదలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్లను ఆకర్శించే పనిలో పడ్డారు. ఎన్నికలు మార్చి 16న జరుగనున్నందున ఈలోగానే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు అవకాశం చిక్కని రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నికలలో పోటీ కేవలం అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తొమ్మిది నెలల పాలనలో గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఏమీ చేయలేక పోయిందనీ, దీంతో ఆ పార్టీపై వీరంతా ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ కారణంగా వీరందరి ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ టిఆర్‌ఎస్‌తో సమానంగా పోరాటం సాగించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి బాగా ఆదరణ పెరిగింది. ఇది కూడా తమ గెలుపుకు కలిసొచ్చే అంశమని ఆ పార్టీ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న టీడీపీ సైతం తమకే పద్దతు పలకడంతో ఆ పార్టీకి చెందిన మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు కూడా తమకే లభిస్తాయన్న ఆశాభావాన్ని బీజేపీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: