జనం ఓట్లేయాలంటే వారిని హామీలతో మెప్పించాలి. ఓట్లు కురిపించే తారక మంత్రాల్లాంటి ఎన్నికల హామీలు సిద్ధం చేసుకోవాలి.. వాటిని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవాలి. అప్పుడే ఎన్నికల గండం నుంచి సులభంగా గట్టెక్కగలుగుతారు. అందుకే ఈ హామీలు అమలు చేయగలమాలేదా అన్నది ఆలోచించకుండా ముందు గెలిస్తే చాలు.. ఆ తర్వాత చూసుకుందామని శక్తికి మించిన హామీలు ఇస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి.. చంద్రబాబు ప్రధానంగా రుణమాఫీపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అనుకున్నట్టే ఆ హామీ వర్క్ అవుట్ అయ్యింది. జనం నమ్మి ఓట్లు గుద్దారు. తీరా ఓట్లేశాక.. మాఫీకి కొత్తరూల్స్ పుట్టుకొచ్చాయి. ఆంక్షలు మొదలయ్యాయి. అందరికీ కాదు.. కొందరికే అంటూ షరతులు వచ్చేశాయి. డ్వాక్రాలకు, చేనేతలకూ రుణమాఫీ అన్నా.. ఇంతవరకూ వాటి సంగతి పట్టించుకోలేదు.

అటు కేసీఆర్ కూడా రుణమాఫీపై మల్లగుల్లాలు పడ్డారు. ఏదోలా అమలు చేశామనిపిస్తున్నారు. ఇక ఇవి కాకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేజీ టు పీజీ వంటి హామీలెన్నో నెరవేర్చాల్సి ఉంది. వాటిపై ప్రస్తుతానికి ఎలాంటి కదలికా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. బాబు, కేసీఆర్ ఎన్నికల్లో హామిలిచ్చి.. అమలు చేయనిజాబితా చాలా పెద్దదే.

కానీ.. ఢిల్లీలో ఓట్ల సునామీ సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ మాత్రం.. ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించుకుంటున్నారు. అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల అమలు శ్రీకారం చుట్టారు. చెప్పినట్టే విద్యుత్ ఛార్జీలు సగానికి సగం తగ్గించేశారు. ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీరు సరఫరా చేస్తారు. ఈ రెండు ప్రధాన హామీలు మార్చి నుంచే అమల్లోకొస్తాయన్నమాట.. ఇప్పుడు చెప్పండి.. ఆడు మగాడ్రా బుజ్జీ అంటే తప్పేంటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: