ఆర్థిక సంఘాలు, సిఫార్సులు, బడ్జెట్ లెక్కలు.. ఇవన్నీ సామాన్యుడికి ఓ పట్టాన మింగుడుపడవు. వీటిని కూలంకషంగా చదివి అర్థం చేసుకుంటే తప్ప.. వాటి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి మీడియా కూడా ఈ విషయంలో తొందరపడుతుందట. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు విషయంలోనూ అంతే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఆంధ్రాకు ఏదో గొప్ప మేలు జరిగిపోయిందని పత్రికల్లో వార్తలు రావడంపై ఆంధ్రా సర్కారు అసంతృప్తిగా ఉంది. విభజన కారణంగా కొండంత నష్టాల్లో ఉన్న ఏపీకి ఈ సిఫార్సులతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదని సర్కారు పెద్దలు భావిస్తున్నారు. కనీసం ప్రత్యేక హోదా వచ్చినా.. కాస్త ఓదార్పుగా ఉండేదని.. ఈ సిఫార్సులు పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు, ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెబుతున్నారు.

కేంద్రం రాష్ట్రాలకిచ్చి పన్నుల ఆదాయంలో వాటా 42 శాతానికి పెంచడం మంచి పరిణామమే. కానీ దీంతో ఏపీకి ప్రత్యేకంగా సాయం అందినట్టుకాదు. అంతేకాకుండా.. ఈ 42 శాతం నిధుల వల్ల దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాలు లోటును అధిగమించి మిగులుకు వస్తుంటే.. ఒక్క ఏపీ మాత్రమే ఇంకా లోటులో ఉండిపోతుందని విశ్లేషిస్తున్నారు. కొత్త సిఫార్సుల ప్రకారం ఐదేళ్ల తర్వాత బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం కూడా మిగులు సాధిస్తుంటే.. ఏపీ మాత్రం ఇంకా లోటు బడ్జెట్ తో బిక్షా పాత్ర పట్టుకునే ఉండాల్సివస్తుందని సాక్షాత్తూ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావే చెబుతున్నారు.

ఐదేళ్ల తర్వాత కొండ ప్రాంత రాష్ట్రాలు, ఏపీ, జమ్ము కాశ్మీర్ మాత్రమే లోటు బడ్జెట్ తో ఉంటాయని ఆయన వివరిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీని కూడా అన్ని రాష్ట్రాలతో పాటే లెక్కేసిందని.. విభజనతో నష్టపోయిన ప్రత్యేక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొసమెరుపేమిటంటే.. ఈ సిఫార్సులు చేసిన ఆర్థిక సంఘానికి నేతృత్వం వహించింది ఘనత వహించిన ఓ తెలుగువాడు వైవిరెడ్డి కావడం.

మరింత సమాచారం తెలుసుకోండి: