భారతీయ రైల్వే కోసం ప్రతి ఏటా ప్రత్యేక బడ్జెట్‌లను ప్రవేశపెడుతున్నప్పటీకి పరిస్థితి మాత్రం నానాటికి తీసుకట్టుగానే మారుతోంది. ప్రపంచంలో అత్యంత పురాతన, అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరు ‘కూత’ పెడుతున్నా ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ చందంగానే ఉంటోంది. స్వాతంత్య్రానికన్నా ముందే పురుడు పోసుకున్న మన రైల్వే వ్యవస్థ చాలా కాలం వరకు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యవస్థగానే మనగలిగింది. చైనా, యూరప్ లాంటి దేశాలు ప్రజా రవాణా కింద రైల్వే వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అవి మనకంటే వేగంగా ముందుకు దూసుకెళ్లాయి. ప్రస్తుతం రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో ప్రపంచంలోనే చైనా అగ్రగామిగా నిలవగా మన భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగవ స్థానంలో ఉంది. ఇక రైళ్లలో అత్యాధునిక సౌకర్యాల విషయం గురించి మాట్లాడితే మన వ్యవస్థ సోదిలోకి కూడా రాదని చెప్పవచ్చు. మన రైల్వే వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు....

1. చైనా రైల్వే వ్యవస్థ లక్ష కిలోమీటర్లు విస్తరించగా, భారతీయ రైల్వేల విస్తరణ నేటికి 64,460 కిలోమీటర్లు. మన రైల్వే ప్రతి ఏడాది సరాసరి 200 కిలోమీటర్ల వరకు మాత్రమే విస్తరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు, అంటే...దాదాపు 68 ఏళ్ల కాలంలో 13 వేల కిలోమీటర్ల రైలు మార్గాలను మాత్రమే నిర్మించుకున్నాం. 2. హిమాలయాల్లోని బారముల్లా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించిన రైల్వే వ్యవస్థలో రోజుకు 12,617 ప్యాసింజర్ రైళ్లు, 7,421 రవాణా రైళ్లు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 7,172 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పదమూడున్నర లక్షల ఉద్యోగులు పని చేస్తున్నారు.

3. ప్రస్తుతానికి 360కి పైగానె పెండింగ్ ప్రాజెక్టులున్నాయి. వీటిని పూర్తి చేయడానికి గతంలో వేసిన అంచనాల ప్రకారం 1.82 లక్షల కోట్ల రూపాయలు అవసరం. గత 30 ఏళ్ల కాలంలో 676 మంజూరైన ైరె ల్వే ప్రాజెక్టుల్లో 1.58 లక్షల కోట్ల రూపాయలతో 317 ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేశారు. 4. మన రైల్వేకు వస్తున్న రెవెన్యూకు వ్యయానికి పెద్ద వత్యాసం లేకపోవడం వల్ల పెండింగ్ ప్రాజెక్టులకు వనరులను సమకూర్చుకోలేక పోతున్నాం. వస్తున్న రెవెన్యూలో రైల్వేల నిర్వహణ వ్యయం 94 శాతం. అంటే వస్తున్న లాభం ఆరు శాతం మాత్రమే. రెవెన్యూకు వ్యయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యత్యాసం 75 నుంచి 80 శాతం.

5. రైల్వేకు ప్రతి ఏటా 26 వేల కోట్ల రూపాయల నష్టం వస్తోంది. వార్షికాదాయం 1.40 లక్షల కోట్లు మాత్రమే. ఇది ప్రభుత్వరంగ సంస్థలయిన భారతీయ రైల్వే కార్పొరేషన్, చమురు సహజ వాయువుల సంస్థ కన్నా తక్కువ. అందుకని రైల్వేల మనుగడకు జనరల్ బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: