కోటి ఆశలతో ఎదురుచూసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే మంత్రి మొండిచేయి చూపారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు వురు ఎంపిలు చేసిన ప్రతిపాదనలన్నీ దాదాపు బుట్టదాఖలే అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా రైల్వే ప్రాజెక్టులు వస్తాయని గంపెడాశతో ఎదురుచూసిన నేతలు, ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలింది. దక్షిణాది రాష్ట్రా లపై గత దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే వస్తూంది. ఈసారి కూడా అదే జరిగింది. గత మంత్రుల మాదిరిగానే తెలుగు రాష్ట్రాలపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ఎలాంటి కనికరం చూప లేదు. రైల్వే శాఖకు ఉత్తరాది మంత్రులు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగదన్న వాస్త వాన్ని మహారాష్ట్రకు చెందిన సురేష్‌ ప్రభు కూడా మరోమారు రుజువు చేశారు. కొత్త రైళ్లు, కొత్త జోన్లు ఊసులేదు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్‌ వస్తోందని ప్రజానీకం ఎంతో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి. విశాఖ, తిరుపతిలలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అసలు ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కాజిపేట- విజయవాడ మూడో రైల్వే లైన్‌ ఏర్పాటును ప్రకటించటం ఒక్కటే కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, అది కార్యరూపం ఎప్పటికి దాల్చుతుందో, ఒక వేళ కార్యరూపం దాల్చుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆర్భాటంగా ప్రకటించిన ప్రాజెక్టులే అతీగతీ లేకుండా పోయాయి. భారత రైల్వేల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆదాయ పరంగా రెండో స్థానంలో నిలిచింది. అయినా, దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు మాత్రం నామమాత్రమే. పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి ఊసే ఎత్తలేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నూతన రైల్వే జోన్‌, విజయవాడ కృష్ణా కెనాల్‌ దగ్గర నూతన కోచ్‌ టెర్మినల్‌ ఏర్పాటు డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. తిరుపతి నుంచి గువహటి (కామాఖ్య టెంపుల్‌) వయా విశాఖ, తిరుపతి నుంచి వారణాసి (కాశి క్షేత్రం) వయా విశాఖ, తిరుపతి నుండి కాట్రా/జమ్మూ (వైష్ణవిదేవి ఆలయం) వయా నగపూర్‌, తిరుపతి నుండి షిరిడీ, కాకినాడ నుండి బికనేర్‌ వయా షోలాపూర్‌, మచిలీ పట్నం నుండి జోగ్‌పూర్‌/రాజ్‌కోట్‌ వయా షోలా పూర్‌, డబల్‌ డెక్కర్‌ ట్రైన్‌ విశాఖ నుండి చెన్నై రైళ్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉన్నా అవి కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నడికుడి నుంచి శ్రీకాళహస్తికి (308 కి.మీ), కోటిపల్లి నుండి నరసాపురం (57 కి.మీ), కాకినాడ-పిఠాపురం (25 కి.మీ), కడప-బంగారుపేట (256 కి.మీ), ఓబుళా పురం-కృష్ణపట్నం (115 కి.మీ), గూడురు- దుగ్గిరాజపట్నం (42 కి.మీ), భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ)కు సంబంధించిన రైల్వే లైన్‌ల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగాల్సివుంది. వీటికీ కేంద్ర రైల్వే మంత్రి రిక్తహస్తాలనే చూపారు.

రైళ్ల వేగం పెంపు న్యూఢిల్లీ : ప్రధాన మెట్రో నగరాల్లో రైళ్ల వేగం పెంచాలని రైల్వేమంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా 9 ఎంపిక చేసిన రైల్వే కారిడార్లలో గంటకు 200 కిలోమీటర్ల వరకు రైళ్లు వేగం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 9 రైల్వే కారిడార్లలో గంటకు 110, 130, 160, 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబయి వంటి అంతర్‌ మెట్రో ప్రయాణాలను త్వరలో పూర్తిచేస్తామన్నారు. ట్రాక్‌ రికార్డింగ్‌, పర్యవేక్షణ, నిర్వహణ వంటి మెరుగైన పద్ధతులు అమలు చేయడం ద్వారా అత్యున్నతస్ధాయి ప్రమాణాలతో రైల్వేట్రాక్‌లను అభివృద్ధి చేస్తామని, వేగం పెంచడానికి ఇది అత్యంత కీలకమని మంత్రి సురేష్‌ ప్రభు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు(బుల్లెట్‌ రైలు)వంటి ప్రత్యేక ప్రాజెక్టులను తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తామని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం పురోగతి దశలో ఉందని తెలిపారు. ఈ ఏడాది మధ్యంతరానికి ఈ పని పూర్తవుతుందని చెప్పారు. తమకు నివేదిక అందిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. వజ్ర చతుర్భుజి మార్గాలపై అధ్యయనం ప్రారంభమైందన్నారు. సరుకు రవాణా రైలు వేగం కూడా పెంచాలని ఆయన ప్రతిపాదించారు. అది ఖాళీ గూడ్సు అయినా, లోడు గూడ్సు అయినా వేగం పెంచాలని భావిస్తున్నామన్నారు. 120 రోజులు ముందుగా రిజర్వేషన్‌ న్యూఢిల్లీ : రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ఇంతకుముందు 90 రోజుల ముందుగానే ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ తర్వాత దాన్ని 60 రోజులకు తగ్గించారు. తాజాగా రైల్వేమంత్రి ప్రకటనతో.. 120 రోజులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇది కొందరికి వరంగానే ఉండవచ్చుగానీ, మరికొందరికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లకు నాలుగునెల్ల ముందుగానే టికెట్లు మొత్తం బుక్‌ అయిపోవడంతో.. తర్వాత చేసుకుందామని ఆగేవాళ్లకు, లేదా అత్యవసర పనుల కోసం ప్రయాణించేవారికి రైలుటికెట్లు దొరికే అవకాశం ఉండదు.

మహిళలకు మరింత భద్రత న్యూఢిల్లీ : రైల్వేబడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి సురేశ్‌ప్రభు. మహిళల భద్రత కోసం టోల్‌ఫ్రీ నెం.182ను ప్రకటించారు. మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు.. మహిళా కోచ్‌ల పెంపు, వృద్ధులకు, వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు.. ఆన్‌లైన్‌లో వీల్‌ఛైర్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం, మహిళలకు, వృద్ధులకు లోయర్‌ బెర్తులు కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా బోగీల్లో సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్‌ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆచరణాత్మక బడ్జెట్‌ : వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ : రైల్వే శాఖ నూతన బడ్జెట్‌ ఆచరణాత్మకమైనదిగా, వాస్తవాలకు ప్రతిబింబంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. బడ్జెట్‌లో కొత్తదనం లేదన్న ప్రతిపక్షాలు విమర్శలను ఆయన తిరస్కరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు బాధ్యతను కూడా ఎన్‌డీఏ సర్కారు తన భుజస్కంధాలపై వేసుకుందని ఆయన అన్నారు. ఆయన గురువారం బడ్జెట్‌పై విలేక రులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వృద్ధికి ఇంజన్‌గా, రవాణా వ్యవస్థకు వెన్నెముకగా రైల్వేలను మార్చేం దుకు, మరింత జవాబుదారీతనంతో ముందుకు సాగేందుకు సరికొత్తగా ఆవిష్కరించారని ఆయన కితాబిచ్చుకున్నారు. కొత్త రైళ్లను ప్రకటించలేదన్న ప్రతిపక్షాల విమర్శపై స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో కొత్త రైళ్లు, రైల్వే ట్రాక్‌లకు సంబంధించి ఎన్ని హామీలు నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. కొత్త బడ్జెట్‌ నాలుగు 'ఎస్‌'లపై స్పష్టత ఇచ్చిందని, అవి వినియోగదారులకు స్పీడ్‌(వేగం), సేఫ్టీ(క్షేమం), సెక్యూరిటీ (భద్రత), సేటిస్‌ఫేక్షన్‌ (సంతృప్తి) అని చెప్పుకున్నారు. కొత్త వ్యవస్థల రూపకల్పన, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ నిధుల కేటాయింపుతో రైల్వేలు, వినియోగదారులకు మంచి రోజులు రానున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఇది ప్రజాకర్షక బడ్జెట్‌ కాదని, అమలులోకి వస్తే ప్రముఖ బడ్జెట్‌ అవుతుందన్నారు. సురేష్‌ ప్రభు వాస్తవమైన, ఆచరణాత్మకమైన బడ్జెట్‌ను తీసుకువచ్చారని, ఏడాది చివరిలో గత ప్రాజక్టులపై సమీక్ష జరిపినప్పుడు దాని ప్రభావం తెలుస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. రైల్వే బడ్జెట్‌ రూపకల్పనలో శాఖ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకున్నారన్నారు. రైల్వే స్టేషన్ల పరిశుభ్రత, మంచి ఆహారం, వేగం, భద్రతలను ప్రజలు కోరుకుంటు న్నారని, వాటిని కొత్త బడ్జెట్‌ ప్రతిబింబించిందని ఆయన వివరించారు.

శతాబ్ది రైళ్లలో వినోదాల సందడి! న్యూఢిల్లీ : ప్రస్తుత రైల్వేవ్యవస్థలో కాస్తంత చెప్పుకోదగ్గ సేవలందిస్తున్న 'శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు' మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లలో కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్‌, భోజనాలు ఇచ్చేవారు. టికెట్‌ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేది. దూర ప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడించబోతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు బస్సుల్లో ఎల్‌ఈడీ టీవీల ద్వారా సినిమాలు వేయడం మనకు ఎప్పటినుంచో తెలుసు. మరి శతాబ్ది రైళ్లలో సినిమాలు చూపిస్తారో, లేక పాటలు వినిపిస్తారో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: