రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయం ఇప్పుడు కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంది. ప్రధాన నేతల పర్యటనలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ యాత్ర చేపడితే...అధికార పార్టీ కూడా జిల్లాపై తమకు ఎలాంటి వివక్ష లేదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో కొనసాగుతున్న జల యజ్ఞం పనులను పరిశీలించేందుకు శుక్రవారం రానుండటంతో నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర భారీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారమే జిల్లాకు చేరుకుని పెండింగ్‌ ప్రాజెక్టులను స్వయంగా పరిశీ లించారు. ప్రాజెక్టుల వారీ పెండింగ్‌ పనులు, ప్రస్తుతమున్న అడ్డంకులను అధికారులు, జిల్లా టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు.

జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని వస్తున్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లాలోని గండికోట వరకు ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం గండికోట వద్ద రైతులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఇప్పటికే జిల్లా అధికారులు ప్రాజెక్టుల పూర్తి సమాచారంతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. వచ్చే ఏడాది గండికోట ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 28 టీఎంసీల నీరు నింపాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పనులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. అసంపూర్తి కాలువల నిర్మాణం, భూసేకరణ వంటి పనులు పూర్తి చేస్తే గండికోటకు నీరు రప్పించుకోవడానికి సులువుగా ఉంటుందని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లాలోని ఆయాకట్టు భూములకు సాగునీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిర్ణయించడంతో పెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ధరలను పెంచుతూ మూడు రోజుల క్రిందటే 22 జీవోను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

గుత్తేదారులను ఇటీవాల నీటిపారుదల శాఖ అధికారులు పిలిపించి పనులు చేయాలని మరోమారు ఆదేశించారు. ఆవుకు నుంచి వచ్చే ప్రధాన కాలువ నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, వామికొండ, సర్వరాయసాగర్‌ పనులు, పిల్లకాలువల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.1,950 కోట్లు అవసరమని అధికారులు లెక్కతేల్చారు. వీటన్నింటినీ పూర్తికి సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా పేస్‌-1 పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి జిల్లాకు రానుండటంతో ఆయాకట్టు రైతుల్లో ఆశలు చిగురుస్తున్నా...గత అనుభవాలు మాత్రం వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ గండికోట ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తైతే 3.87 లక్షల ఎకరాల ఆయాకట్టులో 1.62 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. ఆ దిశగా పనులు చేపడితే వచ్చే ఏడాదికి నీరివ్వడానికి మార్గం సుగమం అవుతుందని అధికారుల అంచనా.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు యాత్రకు శ్రీకారం చుట్టారు. వీరు కూడా శుక్రవారం గండికోట వద్ద చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మాత్రం సీఎం పర్యటనను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. మొత్తం మీద సీఎం పర్యటన జిల్లా రాజకీయాలను మారోసారి వేడెక్కించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: