పాలకుల మాయమాటలు నమ్మి మోసపోయిన రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోకపోతే ఆందోళన చేస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు భరోసా యాత్ర చివరి రోజు గురువారం పామిడి మండలం రామరాజుపల్లి గ్రామంలోని సుంకులమ్మ దేవాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తమకు రుణమాఫీ జరగలేదని పలువురు రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి ముఖ్యమంత్రిని నిలదీస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుచేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతూ ప్రచారానికి కోట్లాది నిధులు వెచ్చిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేస్తోందన్నారు.

పాలకుల వాగ్దానాలు నమ్మి మోసపోయిన రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడితే ఆదుకోవాల్సిన తరుణంలో రాజకీయం చేస్తూ అవమానపరిచేలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి అందిస్తాం, ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రకటనలు గుప్పించారే గాని ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

రుణమాఫీ చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం రుణవిముక్తి పత్రాలు అందజేసి చేతులు దులుపుకుందన్నారు. రుణమాఫీ జరగకపోవడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకు నోటీసులతో బెంబేలెత్తుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, వైకాపా జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, గుంతకల్లు ఇన్‌చార్జ్ వై.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: