పొలిటికల్ లీడర్స్ లో ఆయనో పంచ్ ల ఫలక్ నుమా. సబ్జక్ట్ ఏదైనా.. టాపిక్ ఏదైనా.. అలవోకగా అంత్యప్రాసలతో అదరగొట్టేస్తారు. ఏకే 47లా మాటల తూటాలు పేల్చేస్తుంటారు. ఆయన వాగ్దాటికి ఎదుటివారు నోరు తెరిచి అలా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన పంచ్ లు పేల్చాలంటే ముందుగా స్క్రిప్టు రాసుకోనక్కర్లేదు. ప్రిపేర్ కానక్కర్లేదు. ఆయనే మన సింహపురి సింహం వెంకయ్యనాయుడు.

వెంకయ్య బీజేపీలో సీనియర్ మోస్ట్ నేత. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆ వాగ్దాటి కొన్నిసార్లు గాడి తప్పుతుంది. ఒక్కోసారి వెటకారం పాళ్లు కాస్త ఎక్కువై.. అవతలివారి మనసు గాయపరుస్తుంది. మొన్నటికి మొన్న అలాగే జరిగింది. విపక్షాల తీరుపై ఆయన వేసిన సెటైర్లు గాడి తప్పాయి. కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ వంటి పార్టీలనుద్దేశించి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి.

కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు..ఇంకెక్కడికో దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదని రాహుల్ ను ఉద్దేశించి సెటైర్ వేశారు. అంతేకాదు. సీపీఐ ను కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అని.. టీఆర్ ఎస్ ను వీఆర్ఎస్ అని.. ఇలా ఒక పార్టీ అని కాకుండా అందర్నీ ఏకేశారు. వెంకయ్యతీరుతో చిన్నబుచ్చుకున్న విపక్షాలన్నీ ఏకమయ్యాయి. వెంకయ్యలాంటి సీనియర్ నేత అలా నోటికొచ్చినట్టు పార్లమెంటులో మాట్లాడటం సరికాదన్నాయి. వెంకయ్య సారీ చెప్పేదాకా సభ నడవనియ్యబోమని పట్టుబట్టాయి.

విపక్షాలన్నీ ఏకమై వెంకయ్యపై మూకుమ్మడి దాడి చేశాయి. రైల్వే బడ్జెట్ ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. ఈ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది కూడా. ఈ సమయంలో మోడీ కలుగజేసుకుని.. వెంకయ్య, అరుణ్ జైట్లీతో మాట్లాడి.. వ్యవహారం ఏదోలా సెటిల్ చేయమని సూచించారు. దాంతో వెంకయ్యకు వివరణ ఇచ్చుకోకతప్పింది కాదు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదనీ.. ఎవర్నీ ఇబ్బంది కలిగించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని సభను కోరడంతో వివాదానికి తెరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: