సాక్షి.. ఆంధ్రా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ఉన్న అతి ప్రధాన ఆయుధాల్లో ఇది ఒకటి. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఏ ముహూర్తాన పత్రిక పెట్టాలన్న ఆలోచన వచ్చిందో కానీ.. ఆ పత్రిక, ఛానెల్ లేకపోయి ఉంటే.. జగన్ కు రాజకీయ భవిష్యత్ ఇంతలా ఉండేది కాదన్నది వాస్తవం. రాష్ట్రంలో ఎందరో మాజీ ముఖ్యమంత్రుల కుమారులు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. జగన్ కూడా వైఎస్ మరణం తర్వాత అలా కాకుండా ఉండేందుకు ప్రధానంగా సాయపడింది సాక్షి మీడియానే.

సాక్షి మీడియా లేకుండా.. జనం క్రమంగా వైఎస్ ను, జగన్ ను మరచిపోయే పరిస్థితి వచ్చేదే. కానీ ఎప్పటికప్పుడు వైఎస్ సేవలను, జగన్ ను గుర్తు చేస్తూ.. జగన్ కు తనవంతు ప్రచారం కల్పించింది సాక్షి మీడియానే. అసలే తెలుగు మీడియాలో ఎక్కువ శాతం చంద్రబాబు అనుకూలమన్న సంగతీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ కు ఇప్పుడు సాక్షి మీడియా అవసరం మునుపటికంటే ఎక్కువ.

అలాంటిది ఇప్పుడు సాక్షి మీడియాకు ఈడీ రూపంలో చిక్కువచ్చిపడుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విడతల వారీగా జగన్ ఆస్తులు జప్తు చేస్తోంది. తాజాగా 230 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీ ల్యాండ్‌ రింగ్‌ కేసు వ్యవహారంలో ఈ జప్తులు జరుగుతున్నాయి.

తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో కడప జిల్లాలోని సాక్షి యూనిట్ ప్రింటింగ్ కార్యాలయం ఉండటం విశేషం. కడప జిల్లా సీకేదిన్నె మండలం తాడిగొట్ల పరిధిలోని సర్వే నెంబరు 310లో ఉన్న 2.11 ఎకరాల ఆస్తులను ఈడీ లేటెస్టుగా అటాచ్‌ చేసింది. జననీ ఇన్‌ప్రా లిమిటెడ్‌ పేరుతో ఉన్న ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2.11 ఎకరాల విస్తీర్ణంలో సాక్షి యూనిట్‌ ప్రింటింగ్‌ కార్యాలయం నడుస్తోంది. ఒక్క ప్రింటింగ్ యూనిట్ మూతబడితే పత్రికకు వచ్చిన నష్టం పెద్దగా ఉండదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి జప్తులు ఉండవన్న గ్యారెంటీ ఏమీ లేదు. కదా.. ఇప్పుడు ఒక్క యూనిట్.. ఫ్యూచర్లో మరిన్ని యూనిట్లు మూతబడితే.. ఇప్పుడీ ఆందోళన సాక్షి యాజమాన్యానికి తలనొప్పిగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: