పవన్ కల్యాణ్ జనసేన.. కేవలం ఎన్నికల ముందు ఏర్పాటైన ఈ పార్టీ.. ఎన్నికల వరకే పరిమితమైంది. జనసేన పేరుకే ఓ పార్టీగా ఉన్నా.. కార్యవర్గం కానీ.. కార్యకర్తల నమోదు కానీ ఇంతవరకూ జరగలేదు. ఎన్నికల తర్వాత కూడా పవన్ దానిపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.

అడపాదడపా ట్వీట్లతో హల్ చల్ చేయడం.. అమావాస్యకో పున్నానికో ఓ డైలాగ్ పేల్చడం మినహా జనసేన తరపున పవన్ కార్యాచరణ ఇంతవరకూ ఏమీలేదు. రాష్ట్రంలోని అనేక కీలకాంశాలపై ఇంతవరకూ పవన్ పెద్దగా దృష్టిపెట్టలేదు. తన అభిప్రాయాలూ పంచుకోలేదు. పవన్ కు పెద్ద సంఖ్యలో అభిమాన గణం ఉన్నా.. వారు దిశానిర్దేశం లేక వారు పవన్ వైపు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో రాజధాని ప్రాంతంలో జనసేన జెండాలు ఎగరడం కాస్త సంచలనం సృష్టించింది. భూసమీకరణను వ్యతిరేకిస్తూ జనసేన జెండాలు పట్టుకున్న కొందరు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అనుమతి లేకుండా భూసమీకరణ ఎలా చేస్తారో చూస్తామని నినాదాలు చేశారు.

తమకు తాము జనసేన కార్యకర్తలుగా వారు చెప్పుకుంటున్నా.. వారంతా రాజధాని ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులే. జనసేన జెండాలతో పాటు.. వారు చేతపట్టుకున్న బ్యానర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ బొమ్మతో .. రైతుల తరపున ప్రశ్నించేది ఎవరు.. ? అన్న ప్రశ్నలతో ఈ బ్యానర్లు రూపొందించారు. తమ నేత పవన్ కల్యాణ్ తో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ చెబుతామంటున్నారు వారు. ఇటీవలే రైతు కన్నీరు పెట్టకుండా భూసమీకరణ జరగాలన్న పవన్ ట్వీట్ల తర్వాత ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఈ ఆందోళన పవన్ అనుమతితో జరిగిందా.. లేక పవన్ పేరును రాజధాని రైతులు వాడుకుంటున్నారా.. అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: