జూలై నుంచి ప్రారంభం కానున్న కొత్త 'మద్యం' సంవత్సరంలో ప్రభుత్వమే నేరుగా లిక్కర్‌ అమ్మకాలు ప్రారంభించనుంది. ప్రజలతో ప్రభుత్వ మద్యాన్ని నేరుగా తాగించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంతో మద్యం ప్రియులు సాలీనా సుమారు రూ. 12,000 కోట్లు చేతి చమురు వదిలించు కుంటున్నారు. లక్కి డ్రా ద్వారా జరుగుతున్న లిక్కర్‌ వ్యాపారాన్ని అందుకు భిన్నంగా నేరుగా ప్రభుత్వమే నిర్వహించి కాసులు కురిపించాలని కొత్త దారులు ఆన్వేషి స్తున్నారు. ఆమేరకు కొత్త మద్యం పాలసీ విధివిధానాలపై ఆబ్కారీశాఖ ఉన్నతాధి కారులు గత కొంత కాలంగా 'ఎక్సర్‌సైజులు' చేస్తున్నారు.

ఆదాయాన్ని భారీగా పెంచు కునేందుకే ఇలాంటి నూతన విధానాలపై ప్రభుత్వం మొగ్గుచూపుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ దిశలో ఆ శాఖ అధికారులు కొంత ప్రక్రియను మొదలు పెట్టారు. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ఒక విడత పరిశీలించినట్టు అధికారులు చెబుతున్నారు. దక్షిణాదిరాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు వీటితో పాటు ఢిల్లీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాప్‌లను ఆబ్కారీ శాఖలోని ఉప కమిషనర్‌ (డిసి) స్థాయి అధికారుల బృందం పర్యటించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. మార్చి మొదటి పక్షంలో ఆశాఖలోని కమిషనర్‌ల స్థాయి అధికారుల బృందం కూడా మరోసారి ఆ రాష్ట్రాలను చుట్టిరానుంది. ఆ తర్వాత అన్ని రకాల సమాచారాన్ని సమన్వయపరిచి కొత్త మద్యం పాలసీని రూపొందించనున్నారు.

జూన్‌ చివరినాటికి మద్యం సంవత్సరం ముగియనుంది. ఆలోపుగా కొత్త పాలసీపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎందుకు మద్యం అమ్మకాలను సాగించాలనుకుంటున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించినప్పుడు... రెండు రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయంటున్నారు. కల్తీలేని నికార్సైన మద్యం సరుకును మందు ప్రియులకు చేరవేయడంతోపాటు మందు బాటిళ్ళపై ముద్రించిన ధరలకే వాటిని ప్రభుత్వ షాప్‌ల్లో అందుబాటులో ఉంటాయం టున్నారు. వీటితోపాటు మద్యం అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలకు తావుండదు. దీంతోపాటు మద్యం అమ్మకాల్లో ప్రైవేట్‌ మాఫీయా ప్రమేయం లేకుండా ఈ పద్ధతిలో నిరోధించేందుకు వీలవుతుందని అంటున్నారు.

మద్యాన్ని నేరుగా ప్రజలకు అందచేయడం ద్వారా ప్రభుత్వానికి, మద్యం ప్రియులకు నేరుగా లాభాలుంటాయని అంటున్నారు. తమిళనాడులో ఈ తరహా మద్యం వ్యాపారం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆబ్కారీ శాఖకు చెందిన అధికారుల అధ్యయనంలో వెల్లడైనట్టు చెబుతున్నారు. బెల్టు షాప్‌ల బెడద ఉండదని, ఇప్పటికే రాష్ట్రంలో బెల్టుషాప్‌లను నిరోధించే పనిలో 5,700 కేసులను నమోదు చేసినట్టు ఆబ్కారీ పోలీసులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని మద్యం షాప్‌ల ద్వారా ప్రభుత్వానికి సాలీనా 3500 కోట్లు ఆదాయం సమకూరుతోంది. దీనికి వ్యాట్‌ పన్నులు జత చేయడం వలన రూ. 12,000 వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నేరుగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం ద్వారా ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విమర్శకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: