దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపుగా పతనావస్థకు చేరుకున్న దిశ నుంచి ముందుకు కదులుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు అందడంతో దేశంలోని ఆర్ధిక నిపుణుల మొహంపై దరహాసం కనిపిస్తున్నది. వృద్ధిరేటు పెంచేందుకు, ఆహార ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంతకుముందు అంచనా వేశారు. రెండు మూడు నెలల్లోనే సానుకూల ఫలితాలు వెలువడుతుండటం ఒక వైపు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నది. ప్రతి వ్యక్తికి జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ కల్పిస్తే చాలా వరకూ దేశంలో మార్పు వస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ మూడు అంశాల వల్ల అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయి.

బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందుగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటు ముందు ఉంచిన ఆర్ధిక సర్వే దేశ ప్రజలల్లో కొత్త ఆశలు రేపుతున్నది. మంచి రోజులు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఇంత కాలం చెబుతున్న మాటలు సాకారం కానున్నాయనే ధైర్యం కలుగుతున్నది. గత యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస కుంభకోణాల కారణంగా పతనావస్థకు చేరిన దేశ ఆర్ధిక వ్యవస్థ ఇంత త్వరగా కోలుకుంటుందని చాలా మంది ఊహించలేదు. అయితే ఇప్పుడు ఆర్ధిక సర్వే చెప్పినదాన్ని బట్టి చూస్తే మన దేశం కూడా రెండంకెల వృద్ధిరేటును సాధించడం సాధ్యమనే అనిపిస్తున్నది. దాదాపుగా 12 త్రైమాసికాల ఆర్ధిక స్తబ్దత నుంచి కోలుకుని 2013-14 ఆర్ధిక సంవత్సరం నుంచి వృద్ధిరేటు స్ధిరంగా సాగుతున్నది. ఆ నాటి నుంచి జాతీయ స్థూల ఉత్పత్తిలో 7.2 శాతం వృద్ధిరేటును సాధిస్తున్నందున రాబోయే కాలం దేశ ఆర్ధిక స్థితికి మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని ఆర్ధిక సర్వే వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో 8.1 నుంచి 8.5 వరకూ వృద్ధిరేటు ఉంటుందని ఆర్ధిక సర్వే స్పష్టం చేయడం దేశానికి మరింత ఉత్సాహాన్నిచ్చే అంశం. దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్ధిక సంవత్సరం (2015 - 16)లో 6.3 శాతం ఉంటుందని భారత రిజర్వుబ్యాంకు నెల రోజుల కిందట అంచనా వేయగా దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 7 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ అంచనాల సంస్థ పిడబ్ల్యూసి ముందస్తు లెక్కలు వేసింది. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాల తర్వాతి పరిణామాలను లెక్కించి వారు బహుశ ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు. అయితే వీటన్నింటిని కాదంటూ వృద్ధిరేటు ఎనిమిది అంకె దాటుతుందని ఆర్ధిక సర్వే వెల్లడించింది. రెండు సంవత్సరాల కిందటి వరకూ 4.6 వద్దే ఆగిపోయిన వృద్ధిరేటు ఒక్కఉదుటన పెరగడం కేవలం ప్రభుత్వ రధ సారధి ఇస్తున్న ఊపు వల్లేననడంలో సందేహం లేదు. ఈ మార్చి నెలతో ముగియనున్న 2014-15 ఆర్ధిక సంవత్సరంలో 5.5 శాతం వృద్ధి రేటు నమోదు కానున్నది. కరెంట్‌ ఖాతా లోటు ఆమోదయోగ్యమైన స్థాయిలో ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడం అంశాలు కూడా దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత త్వరితగతిన మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నాయి. ఇలాంటి సానుకూల అంశాల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను ఖచ్చితంగా అమలు చేస్తున్నది. అదే విధంగా మేక్‌ఇన్‌ ఇండియా పేరుతో పారిశ్రామిక ఉత్పత్తులను పెంచేందుకు, మౌలికరంగంలో పెట్టుబడుల ప్రగతికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి అంశాలను మరింత స్పష్టంగా చెప్పేందుకు, మరింత వేగంగా స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్‌లో సూటిగా చెప్పేందుకు ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కసరత్తు చేస్తున్నారు. ఆర్ధిక సంస్కరణలు మరింత వేగవంతంగా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణమని ఆర్ధిక సర్వే స్పష్టం చేయడం పెట్టుబడులకు ఊపుతెస్తుంది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఖజానాకు 43,425 కోట్ల రూపాయల నిధులను తరలించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్నప్పటికీ, ఇప్పటిదాకా కేవలం 1,715 కోట్ల రూపాయల నిధులనే రాబట్టగలిగింది. దీంతో ప్రభుత్వ సంస్థలు అందించే డివిడెండ్లతోనే ఖజానాకు నిధులు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సు, పశ్చిమ బెంగాల్‌ గ్లోబల్‌ సదస్సులు పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించిన నేపథ్యంలో ఆ రాష్ట్రాలు మున్ముందు మరిన్ని వ్యాపార అనుకూల విధానాలతో, పరస్పర సహకారంతో పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని అరుణ్‌ జైట్లీ వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రసంగాలకు ఉత్తేజితు లౌతున్న విదేశీ పెట్టుబడిదారులు గణనీయమైన సంఖ్యలో మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సు 21,000 ఎమ్‌ఒయులను, 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగా, పశ్చిమ బెంగాల్‌ గ్లోబల్‌ సదస్సు దాదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాలూ ఈ తరహా సదస్సులు నిర్వహించి పెట్టుబడులను అందుకోవాలని, తద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అరుణ్‌జైట్లీ ఆకాంక్షిస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపుగా పతనావస్థకు చేరుకున్న దిశ నుంచి ముందుకు కదులుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు అందడంతో దేశంలోని ఆర్ధిక నిపుణుల మొహంపై దరహాసం కనిపిస్తున్నది. వృద్ధిరేటు పెంచేందుకు, ఆహార ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంతకుముందు అంచనా వేశారు.

రెండు మూడు నెలల్లోనే సానుకూల ఫలితాలు వెలువడుతుండటం ఒక వైపు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తున్నది. ప్రతి వ్యక్తికి జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ కల్పిస్తే చాలా వరకూ దేశంలో మార్పు వస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ మూడు అంశాల వల్ల అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయి. దీనివల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పూర్తిగా అడుగంటుతుంది. కేంద్రం ఖర్చు చేసే ప్రతిపైసా కూడా అర్హుడికే చేరుతుంది. అర్హులకు సంక్షేమ పథకాలు చేరడంతోబాటు ప్రభుత్వానికి ఇలా దుర్వినియోగం అయ్యే సొమ్ము అంతా ఆదాయినట్లే అవుతుంది. 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్‌ టన్నులుగా ఉందని ఆర్ధిక సర్వే తెలిపింది. దీనికి మరింతగా ఊతమిచ్చేందుకు వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని సూచించింది. బ్యాంకింగ్‌, బీమా, ఫైనాన్స్‌ విభాగాల్లో సంస్కరణలు అవసరమని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని ఆరి్ధక సర్వే చెప్పింది. 2016లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. వృద్ధిరేటు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం దేశ ఆర్ధిక వ్యవస్థకు శుభ సూచకాలు. గత పది సంవత్సరాలుగా పతనబాటలో సాగిన వృద్ధిరేటు ఆ బాట వీడి పెరుగుతుండటం వల్ల భవిష్యత్తు మరింత మేలుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: