బీజేపీ సర్కారు వెలువరచనున్న తొలి బడ్జెట్ లో కేటాయింపులపై ఏపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. పెద్ద ఎత్తున నిధుల మంజూరు, భారీగా పన్ను రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా వస్తుందని ఓసారి, రాదని ఓసారి రాజకీయ నాయకులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా హుళక్కేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, విభజన చట్టంలో ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రస్తావన లేదు. అప్పటి కేబినెట్ ఆమోదం మాత్రం ఉంది. ప్రత్యేక హోదా రాకపోతే... సౌకర్యాల కల్పనకు కేంద్రం నిధుల మంజూరు మాత్రమే చేస్తుంది. ఇతర కేటాయింపులు, రాయితీలు ఉండకపోవచ్చు. దీనినే పరోక్షంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఆ మధ్య ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఇక, 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ఆధారంగా నిధుల కేటాయింపు జరగనుంది. ఏపీలో లోటు బడ్జెట్ ను భర్తీ చేయాలని కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రత్యేక హోదా అంశం గాలిలో దీపం కానుంది. ఇకపోతే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం 1969 నుంచి ప్రారంభమైంది. 5వ ఫైనాన్స్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని అస్సాం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఈ హోదా దక్కింది. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు ఈ హోదా వర్తింపజేశారు. ఆ తరువాత ఎన్డీయే చేసిన రాష్ట్రాల విభజన సందర్భంగా ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇచ్చారు. దానిని ఆధారం చేసుకుని అధికారంలో ఉన్న ఎన్డీయే ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇస్తుందని స్థానిక నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, అన్నీ తీపి వార్తలే కాదు చేదు గుళికలు కూడా ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ చేదు గుళికల్లో ఒకటి ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరణగా భావించాల్సి ఉంటుందేమో! దానికి బదులుగా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు క్యూ కడతాయని రాష్ట్ర రాజకీయనేతలు అంటున్నారు. కేంద్రం ప్రకటించనున్న తాజా రాయితీలు కొన్ని కంపెనీలకే వర్తించే అవకాశం ఉండడంతో ఓ మోస్తరు కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశం ఎంతో రాజకీయనాయకులే చెప్పాలి.

ఇకపోతే, కేంద్రంలోని ఎన్డీయేకి టీడీపీ మిత్రపక్షం కావున ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇప్పటికిప్పుడు జరిగే అనర్థం ఏదీ లేదు. అయితే, హోదా ఇవ్వకపోతే టీడీపీపై ప్రజల్లో కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ బలపడే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ ఎదురు దాడికి దిగినట్టైతే, "హోదా గురించి కాంగ్రెస్ స్పష్టత నీయకపోవడంతో రాయితీలు కల్పించాం" అంటూ రాష్ట్రంలో జెండా పాతేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికిప్పుడు జనసేన నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. ఎన్నికల నాటికి కాస్త నిలదొక్కుకుంటే, తరువాత ఎన్నికల్లో జరిగే పంచముఖ (టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్) పోటీలో నిలిచేదెవరో, ఓడేదెవరో కాలమే సమాధానం చెబుతుందనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏతావాతా ప్రజలకు స్పష్టమయ్యేది ఏంటంటే... కాంగ్రెస్ పార్టీ చేసిన విభజనలో పార్టీలన్నీ భాగస్వాములే! కానీ, ప్రజల ఓట్ల కోసం దొంగ, పోలీస్ ఆట ఆడుతున్నాయన్నది సామాన్యుడి అభిప్రాయం. అధినేత్రి పుట్టిన రోజు వాగ్దానం అంటూ రాష్ట్రాన్ని విభజించి, సస్యశ్యామలమైన ఏపీని నిరుపేద రాష్ట్రంగా నిలిపిన కాంగ్రెస్ పార్టీ దోషి కాదని రఘువీరారెడ్డి చెబుతుండగా, విభజన మావల్లే సాధ్యమైందని, చిన్నమ్మను గుర్తుంచుకోండని ఎన్నికల ముందు బీజేపీ పేర్కొనడం తెలిసిందే. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు మాత్రం విభజనతో తమకు సంబంధం లేదని, అంతా కాంగ్రెస్ చలవేనని నెపం ఇతరులపైకి నెట్టేస్తున్నారు. విభజన కోసం లేఖ ఇచ్చామని అప్పట్లో చెప్పిన టీడీపీ, ఇప్పుడు విభజన పాపంలో భాగం లేదని చెబుతోంది. రైల్వే బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రేపటి కేంద్ర బడ్జెట్ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఇంకెంత ప్రయత్నం చేస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: