కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుకోవడానికి వీలు లేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆమె అధ్యక్ష స్థానంలో కొనసాగాలని వారు కోరుకొంటున్నారు. ఈ మేరకు బహిరంగంగా ప్రకటనలు కూడా చేసేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి వీలులేని వారు అంటున్నారు.

మరి ఇక్కడ ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. ఇదంతా సోనియాగాంధీపై ఉన్న ప్రేమేనా అని? సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమిని మూటగట్టుకొంది. ఏడెనిమిది నెలలు అయినా ఆ గాయం మానడం లేదు. తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు కాంగ్రెస్ ను కోలుకోనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు తెరమీదకు వచ్చింది.

సోనియాగాంధీకి వయసు మీద పడుతుండటంతో ఈ అంశం పై చర్చ మరింత విస్తృతమైంది. ఇక పార్టీ పగ్గాలు రాహుల్ కు అప్పజెప్పాలనే వాదన చాలా పాతదే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే వచ్చి ఉంటే.. కచ్చితంగా రాహుల్ ను ప్రధానమంత్రిగా చేసే వాళ్లు అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మాత్రం రాహుల్ అంటే కాంగ్రెస్ నేతలే భయపడుతున్నట్టుగా ఉన్నారు.

అయితే సూటిగా ఈ విషయాన్ని చెప్పలేక.. రాహుల్ కు అధ్యక్ష పదవీ బాధ్యతలు ఇవ్వకండీ.. అనలేక కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీనే అధ్యక్ష పీఠంలో కొనసాగాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సోనియా గాంధీ పెద్ద దిక్కుగా ఉండటమే మేలని వారు చెబుతున్నారు. ఇలా మట్లాడుతున్న వారిలో మొయిలీ, సచిన్ పైలట్, అశ్వినీ కుమార్ వంటి ముఖ్యనేతలున్నాయి. వీరి మాటల్లో సోనియా గాంధీ పై ప్రేమ ఏమిటో కానీ.. రాహుల్ కు పార్టీ బాధ్యతలిచ్చే ప్రతిపాదనల పట్ల భయం అయితే స్పష్టం అవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: