కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికంటూ .. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఒకటి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కోటి సంతకాల సేకరణ చేసి.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యేను కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం విశేషమే.

ఇవన్నీ పార్టీని తిరిగి ఏపీలో కోలుకొనేలా చేసే చర్యలు అనుకోవాల్సి వస్తోంది. అయితే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇప్పుడు హైదరాబాద్ లెవల్లో నిర్వహించనున్నారట! ఈ విషయాన్ని స్వయంగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించాడు. మరి ఏపీ ప్రత్యేక హోదా గురించి తెలంగాణ పరిధిలో సంతకాల చేపట్టడం ఒక విశేషమే అనొచ్చు!

మరి ఏపీ లెవల్లో ఈ కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అయ్యిందనే సందేహం కూడా కలుగుతుందిక్కడ! కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది ఏపీ ప్రజల కోసమే కానీ... ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టాల్సిన పరిస్థితులకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణం! రాష్ట్ర విభజన కు మూలం కాంగ్రెస్ పార్టీ రాజకీయం.

మరి విభజన తర్వాత దిక్కులేనిదిగా మారిన సీమాంధ్ర కోసం కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి గిల్లి జోల పాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కూడా నిర్వహించనుందట. మరి ఏపీలో కోటి మంది దొరక్క కాంగ్రెస్ వాళ్లు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ వరకూ తీసుకొచ్చారా?! అనే విమర్శలు అయితే తప్పవిక్కడ!

మరింత సమాచారం తెలుసుకోండి: