కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పక్కా కార్పొరేట్‌ బడ్జెట్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పేద, మధ్య తరగతి, సామాన్య వర్గాలకు ఇది ఏమాత్రం ఉపయోగకరంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ఆర్థికంగా సహకారం అందించిన కార్పొరేట్‌ వర్గాలకు దోహదపడేలా క్విట్‌ ప్రోకో బడ్జెట్‌ను జైట్లీ రూపొందించారన్నారు. జైట్లీ బడ్జెట్‌ సాధారణ ప్రజలు, ఉద్యోగులకు ఏమాత్రం సంతృప్తి కరంగాలేదన్నారు.

కార్పొరేట్‌ రంగానికి పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన ప్రభుత్వం సర్వీసు ట్యాక్స్‌ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్నును రూ.3 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్నారని, ఆ విషయంలో ఎలాంటి మార్పుల చేయలేదన్నారు. ఆరోగ్య బీమా పథకాలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు కొమ్ము కాసేవిగా ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్‌లో ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై సబ్సిడీలను 10 శాతానికిపైగా తగ్గించి మొత్తం రూ.2.27 లక్షల కోట్ల భారాలను మోపారని విమర్శించారు. ఇది ఏ వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిందని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజనతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం అసలు బడ్జెట్‌లో ప్రస్తావనకు రాకపోవటం శోచనీయ మన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలతోపాటు రాష్ట్రానికి కూడా ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందదనే సంకేతంగా చెప్పవచ్చన్నారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, అలా ప్రాజెక్టు పూర్తికావాలంటే సంవత్సరానికి కనీసం రూ.5 వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లనే కేటాయించిందన్నారు.

నిధుల కేటాయింపును చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యన్నారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.5.60 కోట్లు ఏమాత్రం చాలవన్నారు. డీపీఆర్‌ తయారీ కోసం చేసే సర్వేకే ఆ నిధులు సరిపోయే పరిస్థితి లేదన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.కోటి, గిరిజన యూనివర్సిటీకి రెండు కోట్లను కేటాయిం చటం దారుణమన్నారు. కేంద్ర బడ్జెట్‌ వల్ల రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీలేదని వ్యాఖ్యానించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ వర్గాలను మినహా మిగిలిన వర్గాలను నిరాశపరిచేలా ఉందని రామకృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: