రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ ద్వారా వీలుకాని పక్షంలో భూసేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు భయంతో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. సిఆర్‌డిఎ పరిధిలోని 29 గ్రామాల్లో వేలాది మంది రైతులు భూములిచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ జరీబు ప్రాంత రైతులు ఆఖరి నిమిషం వరకు వేచిచూసే ధోరణి అనుసరించారు. పరిహారం పెంపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన తర్వాత అదనపు ప్యాకేజీ ప్రకటించడంతో కొందరు రైతులు ముందుకొచ్చినప్పటికీ మిగిలిన వారు భూములిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.

అయితే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రులు పదేపదే భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అందువల్లే తొలి నుంచి భూసమీకరణను వ్యతిరేకిస్తున్న తాడేపల్లి మండలంలోని పెనుమాక రైతులు కూడా శనివారం భూములిచ్చేందుకు ముం దుకొచ్చారు.

అలాగే తుళ్లూరు మండలంలోని రాయపూడి, మందడం, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, తదితర గ్రామాల రైతులు భూములిచ్చి అంగీకారపత్రాలు పొందారు. రాయపూడిలో భూములివ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో అబ్బరాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకున్నారు.

భూములిచ్చే వారిని అడ్డుకునేది లేదని, అయితే బలవంతంగా భూములు లాక్కుంటే మాత్రం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఉండవల్లి గ్రామ రైతులు కూడా భూములిచ్చేందుకు ముందుకు రాలేదు. గడువు ఈ నెల 28తో ముగియటంతో ప్రభుత్వం ఆదివారం నుంచి భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో ఎలాంటి ఆందోళనలు రేగుతాయోనని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: