ఎన్నికలకు ముందు.. చంద్రబాబు బీజేపీతో జతకట్టినప్పుడు మోడీ- బాబు జోడీని గెలిపించాలని రెండు పార్టీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. మోడీ - బాబులది డెవల్ మెంట్ జోడీ అని ఊదరగొట్టాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ఇక నిధుల ప్రవాహమే అని ప్రకటనలు గుప్పించాయి. జనం కూడా అదే నిజమని నమ్మారు.

తీరా ఎన్నికల్లో ఈ జోడీని గెలిపించాక.. క్రమంగా సీన్ రివర్స్ అవుతోంది. బీజేపీ నుంచి ఆశించినంత సహకారం ఆంధ్రా సర్కారుకు దక్కడం లేదు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పేరుకు ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా.. ఆంధ్రాకు ఎన్డీఏ సర్కారు నుంచి అందుతున్న సాయం అంతంతమాత్రంగానే ఉంటోంది.

మొన్నటి ఆర్థిక సంఘం సిఫార్సులు, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఏది చూసినా.. ఏపీకి నిరాశే మిగిలింది. ఓవైపు కొండలా పెరిగిపోతోన్న లోటు బడ్జెట్.. మరోవైపు రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు.. ఇంకోవైపు సంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు పోలవరం వంటి బృహత్ పథకాలు.. ఇన్నింటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

విభజనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిన పెట్టేందుకు కృషి చేస్తున్నాని చంద్రబాబు చెబుతున్నా.. ఇలా ఎంతో కాలం మాటలతో నెట్టుకురాలేరు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే వ్యూహంలో విఫలమైన బాబు.. ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు. ఏపీని ఈ కష్టాలనుంచి ఎలా గట్టెక్కిస్తారు.. మాటలు తప్ప చేతల్లో సాయం చేయని కేంద్రాన్ని బాబు ఎలా దారికి తెస్తారు.. ఇప్పుడివీ ఆంధ్రాజనం మదిలో మెదులుతున్న ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: