ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రతిపక్ష పార్టీ పాత్ర కీలకం, నిర్మాణాత్మకం. ఒక నాయకుడు పరిపూర్ణంగా ఎదగడానికి, ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకోవడానికి, ప్రజల తరపున పోరాడడానికి అవకాశం వచ్చేది ప్రతిపక్షంలోనే. వై.యస్.రాజశేఖరరెడ్డి, వెంకయ్యనాయుడు వంటి నాయకులు ప్రజల్లో గుర్తింపు సాధించింది ప్రతిపక్ష నాయకులుగానే.

2014ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత బాధ్యతను అప్పగించారు. వాస్తవానికి జగన్ ధ్యాసంతా అధికారంపైనే వుండింది. వై.యస్. మరణం తర్వాత ఆయనపై సానుభూతి వెల్లువెత్తింది. సోనియాతో విభేదించి కాంగ్రెస్ నుండి బయటకొచ్చాక జగన్ వైకాపాను స్థాంపించి ప్రజల్లోకి వెళ్లి దాదాపు 4ఏళ్లు నిరంతర పోరాటం చేశాడు. ఈ సమయంలోనే 16నెలలు జైలులో గడిపారు. ఒకరకంగా అటు కేంద్రంలోని కాంగ్రెస్ తో, రాష్ర్టంలో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలతో ఒంటరిపోరాటం చేశాడు. 2014సార్వత్రిక ఎన్నికలకు ముందు కడప, నెల్లూరు లోక్ సభలకు, అలాగే 17అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తే వైకాపాకు వచ్చిన మెజార్టీలు చూసిన వారెవరికైనా తర్వాత ఎన్నికల్లో వైకాపాకు అధికారం నల్లేరు మీద నడకేననుకుంటారు. జగన్ కూడా అదే విధంగా అనుకున్నాడు. అధికారంపై నూరుశాతం గ్యారంటీ పెట్టుకున్నాడు. కాని చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు జగన్ ఆత్మవిశ్వాసం వెలవెలపోయింది. ఇంతవరకు సరే... ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష నేత పాత్రను సమర్ధవంతంగా నిర్వహించడం పైనే జగన్ రాజకీయ భవిష్యత్ ముడిపడివుంది. వై.యస్. సిఎం కావడానికి దాదాపు పాతికేళ్లు ప్రతిపక్షపాత్రనే పోషించాడు. తన తండ్రిలాగానే జగన్ కు ఈరోజు ప్రజల కోసం పోరాడే అవకాశం వచ్చింది.

ప్రభుత్వం చేసే పొరపాట్లు ప్రతిపక్షానికి ఆయుధాలు. అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను తుంగలో తొక్కడమే కాక, సింగపూర్ రాజధాని పిచ్చితో పచ్చటి పంటపొలాలను ధ్వంసం చేస్తోంది. తరతరాలకు వ్యవసాయ ఉత్పత్తులను అందించే భూములను కాంక్రీట్ అరణ్యంలా మార్చాలనుకుంటుంది. తుళ్లూరు ప్రాంతంలో రాజధానిని విజ్ఞులెవరూ సమర్ధించరు. రాజధాని పేరుతో వేల ఎకరాల మాగాణి పొలాలను నిర్వీర్యం చేయాలని ఎవరూ కోరుకోరు. ఇక్కడ రాజధాని నిర్మాణం కూడా ఈ ప్రాతిపదికన జరిగి ఉండదు. రాజధానికి భూములివ్వడానికి కొందరు రైతులు ఒప్పుకున్నారు. మెజార్టీ రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం సిఆర్ డిఏ చట్టం తెచ్చి బలవంతపు భూసేకరణకు నడుం కట్టింది.

ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మొదట్లోనే దీనిపై స్పందించి రైతుల పక్షాన పోరాడి ఉండాలి. కాని ఆరోజు కొంత నిర్లక్ష్యం చూపారు. ఎట్టకేలకు ఇప్పుడు మేల్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలంతా రాజధాని గ్రామాలలో పర్యటించి రైతులకు భరోసా ఇస్తున్నారు. పంటలు వేసుకోండి, మీకు అండగా మేముంటామంటున్నారు. ప్రతిపక్షం ఈ మాత్రం అండగా ముందుండి నడిస్తే చాలు, భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులే ముందుకొచ్చి తమ పొలాలను కాజేస్తున్న ప్రభుత్వం మెడలు వంచగలరు. వై.యస్. అనుక్షణం రైతు గురించి ఆలోచించారు. జగన్ కూడా అదే బాటలో నడిచి అన్నదాతలకు అండగా నిలవాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: