మోడీ సర్కారుపై ఆంధ్రా సర్కారు పెట్టుకున్న ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. తొమ్మిదినెలలు గడుస్తున్నా.. ఒకటీ అరా మినహా.. పెద్దగా రాష్ట్రానికి ఒనగూడిందేమీలేదన్న అభిప్రాయం తెలుగుదేశం నాయకుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ మాత్రం దానికి ఎన్డీఏలో ఉండటం ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ తర్వా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు చూస్తే.. టీడీపీ - బీజేపీ మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులలోఉన్నా.. కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలు సైతం అమలుకాకపోవడంపై టీడీపీలో అసహనం రగిలిస్తోంది. ఇది నేను కూడా ఊహించలేదు.. ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదని.. చంద్రబాబే మీడియా ముందు బేలగా మాట్లాడటం చూస్తుంటే తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామన్న వేదన ఆయన మాటల్లో కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు మీడియా ముందు ఎప్పుడూ మోడీపై ప్రత్యక్షంగా విమర్శలు చేయలేదు. కానీ బడ్జెట్ తర్వాత మాట్లాడన చంద్రబాబు నేరుగా మోడీపైనే విమర్సలు చేశారు. మీరు తిరుపతిలో ఏంచెప్పారు.. మనం ప్రజల ముందు ఎలాంటి హామీలిచ్చాం.. అవి నెరవేర్చే బాధ్యత మీకు లేదా అని సూటిగా ప్రశ్నించడం చూస్తుంటే.. బీజేపీకీ టీడీపీకి చెడినట్టే కనిపిస్తోంది.

నిధుల కోసం న్యాయం చేసేవరకూ కేంద్రంతో పోరాడదాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క చంద్రబాబే కాదు.. బడ్జెట్ తర్వాత మాట్లాడిన టీడీపీ నేతలంతా మునుపెన్నడూ లేనంత ఘాటుగా మాట్లాడారు. ఎంపీ శివప్రసాద్ మాటలే అందుకు ఉదాహరణ. వనవాసంలోని పాండవుల్లా ఉంది మా పరిస్థితి.. మా ఆయుధాలన్నీ జమ్మి చెట్టుపై ఉన్నాయి. బాబు ఒక్కమాట చెబితే చాలు.. అస్త్రాలు బయటకు తీస్తాం.. పోరాటం షురూ చేస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: