చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణం విషయంలో ఓ కీలక ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య రాజధాని భూసమీకరణ తొలివిడత ప్రక్రియను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసింది. సరిగ్గా రెండు నెలరోజుల్లోనే దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించింది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. బాబు సర్కారు సాధించిన ఈ విజయం అంత సులువైందేమీకాదు.

భూసమీకరణ అంటే మాటలు కాదు.. భూమికి రైతుకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. రైతు ప్రాణాలు వదులుకోడానికైనా సిద్ధపడతాడు కానీ.. భూమి వదలుకునేందుకు ఇష్టపడడు. కారణం.. ఆ భూమిలోనే తన ఆత్మగౌరవం ఉంటుంది. జీవితానికో భరోసా ఉంటుంది. అందులోనూ సారవంతమైన రెండు, మూడు పంటలు పండే భూములు ఇవ్వడమంటే మాటలు కాదు.

మరి ఇంతటి క్లిష్టమైన ప్రక్రియను చంద్రబాబు సర్కారు ఎలా విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ఇందుకు ప్రధాన కారణం మంత్రి నారాయణ నిబద్ధత, కార్యదీక్షత అని చెప్పక తప్పదు. చంద్రబాబు నారాయణను ఎందుకంతగా నమ్ముతారో చెప్పేందుకు ఈ భూసమీకరణ ప్రక్రియే సాక్ష్యం. ఎన్నో వివాదాలున్నా.. రైతుల నుంచి ఆందోళనలు, నిరసనలు ఎదురైనా.. నారాయణ వాటిని ఓర్పుగా, నేర్పుగా అధిగమించారు.

దాదాపు ఈ రెండు నెలలూ నారాయణ రాజధాని ప్రాంతంలోనే మకాం వేసారు. రోజువారీ టార్గెట్లు విధించుకుంటూ.. అధికారులను, నాయకులనూ సమన్వయం చేసుకుంటూ చాలా ఓపిగ్గా వ్యవహరించారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఎలాంటి వివాదాన్నైనా రాజకీయంగా వాడుకునేందుకు విపక్షం సిద్ధంగా ఉన్నా.. నారాయణ వారి ప్రయత్నాలు సాగనివ్వలేదు. ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి.. రైతుల సందేహాలు తీర్చి.. వారిని భూములిప్పించేందుకు ఒప్పించగలిగారు. ఇలాంటి కార్యసాధక మంత్రులు ఉంటే.. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రులు ఎలాంటి కార్యాలైనా సాధిస్తారనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: