బడ్జెట్ పై చర్చలో భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడమని.. యూనియన్ బడ్జెట్ లో తమకు జరిగిన అన్యాయంపై నిగ్గదీయాలని తమ పార్టీ ఎంపీలను అదేశించాడట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసినా... ప్రస్తుతానికి అయితే భారతీయ జనతా పార్టీ పై విమర్శనాస్త్రాలనే సంధించాలని కేసీఆర్ నిర్ణయించాడట.

దీనికి ప్రధాన కారణం యూనియన్ బడ్జెట్ లో తమకు అన్యాయం జరగడమేనట. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ చాలా ఆశలు పెట్టుకొన్నాడట. కేంద్రం నుంచి జరిగే కేటాయింపుల ను ఊహించుకొని కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు కూడా వేశాడు. అంగన్ వాడీలకు జీతాలు కూడా పెంచుతానని హామీ ఇచ్చాడు. కేంద్రం నుంచి కేటాయింపులు పెరుగుతాయని.. దీంతో ఆ డబ్బును అలా వాడుకోవచ్చని కేసీఆర్ ప్రణాళికలు వేశాడు.

అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం షాక్ నే ఇచ్చింది. జైట్లీ బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు జరగకపోగా... మామూలుగా జరిగే కేటాయింపులు కూడా జరగలేదు. గత ఏడాది స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 16 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ సారి 20 వేల కోట్ల రూపాయలు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశారట కేసీఆర్. అయితే చివరకు ఆ శాఖకు జరిగిన కేటాయింపులు కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు!

దీంతో అంగన్ వాడీలకు ఇచ్చిన హామీని ఎలా నెరేవేర్చాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదట. దీంతో ఆయన వెంటనే ఢిల్లీలోలో ఉన్న తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాడు. బడ్జెట్ పై చర్చలో గట్టిగా ఉండండి.. కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండగట్టండి అంటూ కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాడు. మరి టీఆర్ఎస్ ఎంపీలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: