జర్నలిజం.. ఓ సెన్సెటివ్ టాస్క్.. సమాజంతో ముడిపడి ఉన్న ఓ బాధ్యతాయుతమైన వృత్తి. అందరికంటే ముందు వార్త ఇవ్వాలన్న పోటీతత్వం ఓ జర్నలిస్టుకు అవసరమే అయినా.. కామన్ సెన్స్ అనేది అతనికి అత్యవసరం. ఎలక్ట్రానిక్ మీడియాలో పోటీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో టీవీ జర్నలిస్టు విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. పోటీలో కేవలం సెకన్ల తేడాతో వెనుకబడినా అతను వృత్తిపరంగా రిమార్కులు ఎదుర్కోక తప్పదు.

ఈ పోటీ పరుగులో తెలుగు ఎలక్ట్రానికి మీడియా కొట్టుకుపోతూ.. అప్పడుప్పుడు కనీస మానవత్వ స్పందన కూడా మరచిపోతుందేమో అనిపిస్తుంటుంది. శనివారం జరిగిన ఓ ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న ఓ మహిళకు బెంగళూరు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను అమర్చేందుకు చేసిన ప్రయత్నం అబ్బురపరచింది.

ఆ గుండె బెంగళూరు ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ ఆసుపత్రి వరకూ ప్రయాణించిన ప్రతి సెకనూ విలువైందే. ఆ గుండె ప్రయాణం కోసం బేగంపేటలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను ఆ రూట్లో నిలిపేశారు. ఓ రోగి ప్రాణం కోసం వైద్యులు అన్నిజాగ్రత్తలు తీసుకుంటే.. మీడియా ప్రతినిధులు కొందరు చేసిన అతి జర్నలిజంపై గౌరవం తగ్గేలాచేసింది.

బేగంపేటలో ఫ్లైట్ ల్యాండైన వెంటనే రిట్రైవల్ బాక్సులో ఉన్న గుండెను.. అంబులెన్సులోకి మార్చి.. సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ఈ ప్రయాణంలో మీడియా ప్రతినిధులు ఏకంగా అంబులెన్సు సిబ్బంది నోటి దగ్గర మైకులు పెట్టడం.. వారి స్పందన కోరారు. ప్రతి సెకనూ విలువైన ఆ సమయంలో.. ఆ అంబులెన్స్ నిర్వాహకుడి మాటలు రికార్డు చేయడం అవసరమా.. ఆ విషయంలో ఆయన స్పందించేదేముందుటుంది.. ఆపరేషన్ ముఖ్యమా.. స్పందన రికార్డు చేయడం ముఖ్యమా.. అన్న కామన్ నెన్స్ మరవడం దారుణం. అంబులెన్స్ సిబ్బంది కూడా కొందరు గుండె సంగతి పక్కకుపెట్టి.. మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొసమెరుపు. ఈ మీడియా పిచ్చి సమాజాన్ని ఎటుతీసుకెళ్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: