ఇనుము బాగా కాలినప్పుడే సుత్తి దెబ్బ పడాలి. అప్పుడే.. వంగుతుంది.. వేడి తగ్గిపోయాక ఎన్ని దెబ్బలు వేసినా ఉపయోగం ఉండదు. ఇదే సూత్రం రాజకీయాలకూ వర్తిస్తుంది. రాజకీయాల్లోనూ ఆ టైమింగ్ చాలా అవసరం. ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ విషయంలో అదే లోపించినట్టుంది. ఇప్పడు జగన్ రాజధాని భూముల పర్యటన ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.

రాజధాని ప్రాంతంలో భూమీకరణ రెండు నెలల నుంచి జరుగుతోంది. చాలామంది రైతులు.. ముఖ్యంగా నదిపక్కన ఉన్న గ్రామాల రైతులకు తమ భూములివ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వారు సర్కారు తీరుపై బహిరంగంగానే మండిపడ్డారు. భూములిచ్చేది లేదని తేల్చిచెప్పారు. కానీ వారి పోరాటానికి ప్రతిపక్షం నుంచి సరైన మద్దతు లభించలేదు.

రైతులందర్నీ సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి కూడదీసే ప్రయత్నాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అంతగా దృష్టిపెట్టలేదు. అడపాదడపా వైసీపీ నేతల పర్యటనలు చేయడం తప్ప.. సీరియస్ గా పోరాటం చేయలేదు. రాజకీయంగా దెబ్బవుతుందనుకున్నారో.. విధాన నిర్ణయం తీసుకోవడంలో జాప్యమే తెలియదు గానీ.. రాజధాని రైతుల గోడు పట్టించుకున్న పార్టీలే లేకుండా పోయాయి.

అడపాదడపా సమస్యలున్నా.. మొత్తానికి ప్రభుత్వం భూసమీకరణ లక్ష్యాన్ని అధిగమించింది. రైతులను నయానో, భయానో ఒప్పించి.. మొత్తం 30 వేల ఎకరాలు సేకరించింది. అంతా అయిపోయాక.. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు జగన్ సిద్ధమయ్యారు. మార్చి 3న రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడికొండ, నియోజక వర్గ పరిధిలోని గ్రామాలు సహా తుళ్లూరులో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. మార్చి 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తూతూమంత్రంగా పర్యటించడం కాకుండా.. ముందు నుంచే పటిష్టమైన వ్యూహం అనుసరించడంలో జగన్ విఫలమయ్యారని చెప్పకతప్పదు. మరి ఇలాంటి సలహాలు జగన్ కు ఎవరిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: