ఇన్నాళ్లూ పార్ట్ టైమ్ రాజకీయాలతో సరిపెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక నేరుగా రాజకీయాల్లో అడుగు పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో ఏపీ జనం రగిలిపోతున్నారు. ఈ సమయంలోనూ సరిగ్గా స్పందించకపోతే.. రాజకీయ భవిష్యత్తే అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది. అందుకే.. ట్వీట్లతోనే పాలిటిక్స్ నడిపే పవన్ బయటకు రాక తప్పలేదు.

ముందు ఆగ్రహంతో ఉన్న ఏపీ జనాన్ని సముదాయించాలి. ఆ పని చేయాలంటే.. కేంద్రం నుంచి సాయం అందుతుందనే భరోసా రావాలి. అలా రావాలంటే.. ఎన్డీఏపై ఒత్తిడి పెంచాలి. కానీ ఇన్నాళ్లూ ఏపీ సీఎం చంద్రబాబు చేసింది అదే కదా.. లాబీయింగ్ లో ఆరితేరిన చంద్రబాబుతో కాని పని.. పవన్ కల్యాణ్ తో అవుతుందా అన్నది ఇప్పటి ఆసక్తికరమైన ప్రశ్న.

పవన్ కల్యాణ్ కు ఇప్పటికిప్పుడు రెండు కీలకమైన టాస్కులున్నాయి. ఒకటి కేంద్రంతో రాష్ట్రానికి నిధులు రప్పించడం.. మరొకటి.. రాజధాని రైతులను సముదాయించడం. రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమైన పవన్ కల్యాణ్ పట్ల అక్కడి రైతులు ఎలాంటి స్పందన చూపుతారన్నది ఇంట్రస్టింగ్ పాయింట్.. మొన్నటికి మొన్న.. పవన్ రాజధాని రైతులకు జరిగే అన్యాయంపై ప్రశ్నించాలంటూ అక్కడి రైతులు బ్యానర్లు కట్టుకుని నినాదాలు చేయడం సంచలనం సృష్టించింది కూడా.

ఐతే.. రాజధాని భూముల విషయంలో ప్రభుత్వం అనుకున్నది సాధించింది. తొలివిడతలో 32వేల ఎకరాల భూమి సేకరించేసింది. రైతులంతా తమ సమ్మతి తెలియజేస్తూ ప్రభుత్వాన్నికి పత్రాలు రాసిచ్చేశారు. ఇప్పుడు పవన్ వెళ్లి వారితో ఏం మాట్లాడతారు.. వారికి ఎలా సాయం చేస్తారు.. అన్న విషయం తేలాల్సి ఉంది. ఇన్నాళ్లూ చంద్రబాబుకు సహకరిస్తూ వచ్చిన పవన్ తొలిసారి బాబు సర్కారుపై విమర్శలు చేస్తారా.. లేక ఇక్కడ కూడా సర్కారు పాటే పాడతారా.. అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: