ఢిల్లీ కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కేంద్రంతో వివాదానికి దిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రధాన కార్యదర్శిగా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆర్‌ఎస్ నేగిని నియమించాలని పట్టుబడుతున్న ఆప్ ప్రభుత్వం ఈ పదవికోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికార్ల జాబితాను తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏ అధికారిని కేంద్రం బలవంతంగా రాష్ట్రప్రభుత్వంపై రుద్దరాదని, అంతేకాకుండా నేగి ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నందున ఆయనను ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమించడంలో తప్పేమీ లేదని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయినందున రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులకు నియామకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖే జరుపుతుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీ పదవికోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికార్లలో ఒకరిని ఎంపిక చేయాలంటూ హోం శాఖ వారి పేర్లున్న జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. గతంలో ఢిల్లీ జల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా ఢిల్లీ ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించిన నేగి నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపు పొందడమే కాకుండా ఢిల్లీ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది.

అయితే నేగి చాలా జూనియర్ ఐఏఎస్ అధికారి అని, ఈ పదవికోసం నిర్ణయించిన 80 వేల రూపాయల నెలజీతం పరిధిలోకి రాడని పేర్కొంటూ ఆయనను చీఫ్ సెక్రటరీగా నియమించాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను హోం శాఖ తిరస్కరించింది. అంతేకాకుండా ఆయనకన్నా సీనియర్లయిన దాదాపు డజను మంది ఐఏఎస్ అధికారులు రాష్ట్రంలో వివిధ కీలక పదవుల్లో ఉన్నందున జూనియర్ అయిన నేగిని చీఫ్ సెక్రటరీగా నియమించడం సరికాదని కూడా హోం శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి తెలియజేసింది.

అయితే నేగి జూనియర్ అధికారి అయిన పక్షంలో అత్యంత సున్నిత రాష్టమ్రైన అరుణాచల్ ప్రదేశ్‌కు చీఫ్ సెక్రటరీగా ఆయన ఎలా పని చేస్తున్నారని భావిస్తున్న ఆప్ ప్రభుత్వం హోం శాఖ వాదనను అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: