కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే.. డీలా పడిన పార్టీ కేడర్-కు ఉత్సాహం కలిగే చాన్స్ ఉంది. సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేసేందుకే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రియాంకకు సోమవారంనాడు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించనున్నట్లు సమాచారం. నిజానికి ప్రియాంకను రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత మూడు నెలలుగా తీవ్రంగా ప్రయత్నించారంటూ వార్తలు వస్తున్నాయి.

రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు స్వాగతించినట్లు విశ్వసనీయ కాంగ్రెస్ వర్గాల భోగట్టా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ సెలవు పెట్టి మరీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రియాంకకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించాలన్న ఆలోచన అధిష్టానంలో రావడం విశేషం.

ఇలా ఉండగా సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ నేడో రేపో ఢిల్లీకి తిరిగివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి పార్టీ పునర్వ్యవస్థీకరణపై రాహుల్ గాంధీ దృష్టి పెడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: