కేంద్ర బడ్జెట్-లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయామన్న అసంతృప్తి ఓ వైపు, ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు సీఎం చంద్రబాబును తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్-ను అన్నివిధాలా ఆదుకుంటామన్న కేంద్రం మాటలు చేతల్లో కనిపించలేదు. దీంతో చంద్రబాబు బాహాటంగానే చిర్రుబుర్రులాడుతున్నారు. ప్రధాని మోదీపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో గుర్రుగా ఉన్నారు. అయితే చంద్రబాబు అతి జాగ్రత్తే ఈ పరిస్థితికి కారణమైందంటున్నారు పరిశీలకులు.

అంతా అనుకున్నట్టే జరుగుతుంది. కేంద్ర బడ్జెట్-లో ఏపీకి నిధుల వర్షం కురుస్తుందనుకున్న సీఎం చంద్రబాబు అసలుకే మోసం రావడంతో ఆవేదనతో రగిలిపోతున్నారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహాయం చేస్తామన్న కేంద్రం ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. రెక్కలు విరిచి ఎగరమంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఒక నివేదిక తయారుచేసి ప్రధానమంత్రికి, ఆర్థికమంత్రికి పంపుతామన్నారు. ఈసారి పక్కా ప్రణాళికతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారాయన.

రాష్ట్రానికి కేంద్రం హ్యాండివ్వడానికి చంద్రబాబు అతి జాగ్రత్తే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం తమతో ఎలా ఉన్నా తాము మాత్రం నోరెత్తొద్దని సహచరులకు చంద్రబాబు ముందు నుంచీ చెప్పుకుంటూ రావడమే ఇందుకు ప్రధాన కారణమని స్వపక్షంలోని నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగువాడైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా వంటి అంశాలు అసలు చట్టంలోనే లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరో అడుగు ముందుకేసి అసలు ఏపీకి ప్రత్యేక హోదా అంశం పరిగణనలోనే లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్-కు సాయంపై కేంద్ర వైఖరి తేలిపోవడంతో ఇన్ని రోజులూ సంయమనం పాటించిన చంద్రబాబు ఇక ఆలస్యం చేయకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: