ఏమున్నా ప్రతిపక్షంలో కూర్చొన్నప్పుడు ఉన్న సౌలభ్యం అధికారంలోకి వచ్చాకా ఉండదు. ప్రజలను ఆకట్టుకొనేలా మాట్లాడటానికి ప్రతిపక్ష స్థానమే కరెక్టు. అధికారం విస్తరించే కొద్దీ కష్టాలు కూడా అధికం అవుతాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్లకు ఈ విషయంపై అవగాహన వస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలోకూడా భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీకి కొత్త ఇబ్బంది మొదలైంది.

అక్కడ వేర్పాటు వాద అనుకూల పార్టీ పీడీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఇలా అధికారంలో భాగస్వామి అయినందుకు అనందించాల్సిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పీడీపీ తీరుతో కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు, వేర్పాటు వాదులకు కృతజ్ఞతలు తెలిపాడు ముఫ్తీ మహ్మద్ సయీద్.

ఆయన భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించడంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం బీజేపీకి ఇబ్బందే! సయీద్ ది మరీ బరితెగింపు ప్రకటన. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఘనత భారత సైన్యానిది, భద్రతాదళలదీ అయితే ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ఉగ్రవాద సంస్థలకువేర్పాటు వాదులకు, పాక్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలపడమంత దారుణమైన విషయం మరోటి ఉండదు!

మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే సయీద్ తీరు ఇంతటితో ఆగిపోదు.. ఆయన ఇంకా ఎన్నో చేస్తాడు. వాటన్నింటికీ కూడా బీజేపీ దే బాధ్యత. అది కూడా కాశ్మీర్ వంటి అంశం గురించి సయీద్ పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే కమలం పార్టీకి అంతకన్నా ఇబ్బంది మరోటి ఉండదు! మరీ ఈ పరిస్థితులను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: