దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు జగన్ పార్టీకి దగ్గరవుతున్నారా? కొందరు కాపు నేతలతో కలసి దాసరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారా? గత కొద్దికాలం నుంచీ దీనికి సంబంధించి సీరియస్‌గానే చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, పళ్లంరాజుకు కేంద్రమంత్రి వర్గంలో పెద్దపీట వేసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి కాపు ఓటు బ్యాంకు రోజురోజుకూ బలపడుతోందని జగన్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి గండికొట్టే ప్రయత్నాలను ఆ పార్టీ మొదలుపెట్టింది. కాపు వర్గంలో ఇమేజ్‌ ఉన్న వారిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా, కాపు ఓటు బ్యాంకును చీల్చాలన్న ఎత్తుగడతో జగన్‌ పార్టీ దూకుడుగా వెళుతోంది. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరేందుకు దర్శకతర్న దాసరి నారాయణరావు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయన తన అనుచరులతోనూ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాపు కోటాలో రాజ్యసభతో పాటు కేంద్రమంత్రి పదవి కూడా సాధించిన దాసరికి ఇప్పటికీ అదే కార్డు శ్రీరామరక్షగా ఉంది. కోస్తా కాపులలో ఇప్పటికీ ఒక వర్గమంటూ ఉన్న దాసరిని తెరమీదకు తీసుకురావడం ద్వారా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపులను ఆకట్టుకోవాలంటే.. దాసరి నారాయణరావే సరైన నాయకుడని భావిస్తున్నారు. అందుకే ఆయనను పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదిపారు. ఇప్పటికే అదే ప్రాంతంలో సినీ గ్లామర్‌ ఉన్న చిరంజీవికి కాంగ్రెస్‌ పార్టీ కేంద్రమంత్రి పదవి ఇచ్చి కాపులకు దగ్గరయింది. మరికొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని కూడా కాపు వర్గానికే కట్టబె ట్టడం ద్వారా, కాపులను పూర్తి స్థాయిలో మళ్లించుకోవాలన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే, దాసరి కంటే ఉత్తమ నేత ఎవరూ లేరని జగన్‌ భావిస్తున్నారు. దాసరితో చిరంజీవికి చెక్‌ పెట్టాలన్నదే జగన్‌ లక్ష్యమంటున్నారు. మరోవైపు దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా తనయుడు రాధాకృష్ణను కూడా జగన్ పార్టీలో చేరమని సలహా ఇచ్చింది కూడా దాసరి నారాయణరావేనన్న ప్రచారం జరుగుతోంది. మరికొద్దిరోజుల్లో జైలులో ఉన్న జగన్‌ను దాసరి కలిసేందుకు నిర్ణయించినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చేలోగా ఒక బ్రహ్మాండమైన రాజకీయ చిత్రం నిర్మించే యోచన కూడా లేకపోలేదంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: