ఆంధ్రప్రదేశ్‌ రాజధాని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతం తుళ్లూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో వరుసగా కీలకనేతల పర్యటనలు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి తుళ్లూరుపైనే ఉంది. రాజధాని గ్రామాలలో మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటించనుండగా, ఈ నెల 5వ తేదీన ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రాజధాని గ్రామాలలో పర్యటించనున్నారు. సోమవారమే పవన్‌ పర్యటన ఉండగా, చివరి నిమిషంలో ఆ పర్యటన వాయిదా పడింది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన తర్వాతనే పవన్‌ రాజధాని పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే జగన్‌ పర్యటించిన 48 గంటల వ్యవధిలోనే పవన్‌ పర్యటించనుండ డం విశేషం. ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాలలో ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు వివిధ రూపాలలో అక్కడ నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు కీలకనేతల పర్యటనల నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. రైతులకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పర్యటించి రైతుల కష్టసుఖాలు తెలుసుకోనున్నారు. అయితే డిసెంబర్‌ 31 నుంచి అమలులోకి వచ్చిన రాజధాని భూసేకరణ గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది.

ఇప్పటికే పలుమార్లు భూసేకరణ గడువును పెంచిన ప్రభుత్వం ఈ సారి గడువును పెంచేది లేదని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి చట్ట ప్రకారం తీసుకుంటామని సర్కారు చెప్పడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగింది. అయితే ఈ నెల 7వ తేదీ ఏపీ శాసనసభ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లిసలో రాజధాని అంశంపై వైకాపా పట్టుబట్టే అవకాశం ఉంది. మంగళవారం జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన ఎలా సాగుతుందో అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రైతు సమస్యలపై ట్విట్టర్‌లో స్పందించిన పవన్‌ రాజధాని కోసం రైతుల నుంచి పంట భూములను సమీకరించడంపై ఇటీవల ట్విట్టర్‌లో పవన్‌ తీవ్రంగా స్పందించారు. ఎంతో నమ్మకంతో ప్రజలు భాజపా-తెదేపా కూటమిని గెలిపించారని, వారి చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపైనే ఉందని పవన్‌ ట్వీట్‌ చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు పవన్‌ పర్యటించనున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: