ఆమ్ ఆద్మీ పార్టీలో ఆధిపత్య పోరు సాగుతున్నది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవినుంచి తప్పించాలని కుట్రలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలో సీనియర్ నేతలైన యోగేంద్రయాదవ్, సీనియర్ నేత ప్రశాంత్‌భూషణ్ ఈ కుట్రకు కేంద్రబిందువులని ఆరోపణలు రావడం గమనార్హం. ఈ విషయంపై పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవినుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌లను పరోక్షంగా ఉద్దేశించి ఆరోపణలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు లీకులు ఇవ్వడమేకాకుండా, పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందని ప్రచారం చేస్తున్నారని వచ్చిన అభియోగాలపై బుధవారం జరిగే పార్టీ జాతీయ ప్రతినిధుల సమావేశంలో చర్చించి.. చర్యలు తీసుకునే అవకాశమున్నదని చెప్పారు.

జాతీయ ప్రతినిధుల కమిటీనుంచి యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌ను తప్పించాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో రెండు వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా వాతావరణం ఉంది. పది రోజుల క్రితం అంతర్గత లోక్‌పాల్ అడ్మిరల్ రామ్‌దాస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)కి ఓ లేఖ రాశారు. అందులో ఒకరికి ఒక పదవి అన్న విషయంపై చర్చ జరుపాలని.. ఢిల్లీ సీఎంగా తీరికలేకుండా ఉన్న కేజ్రీవాల్ జాతీయకన్వీనర్ పదవిని మరొకరి అప్పగించాలని సూచించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరుగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యోగేంద్రయాదవ్‌ను పార్టీ జాతీయ కన్వీనర్‌గా చేయాలన్న రహస్య ఎజెండాతోనే రామ్‌దాస్ ఈ లేఖ రాసినట్లు కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్న నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్‌భూషణ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ స్థానంలో యోగేంద్రకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.

పార్టీలోని కొందరు.. ముఖ్యంగా కొందరు సీనియర్ నేతలు పార్టీ జాతీయ కన్వీనర్ పదవినుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పించాలని చూస్తున్నారు అని సంజయ్‌సింగ్ సోమవారం మీడియాకు తెలిపారు. కుట్రపూరిత ఉద్దేశంతో లేఖలు రాయడంతోపాటు వ్యాఖ్యలు చేస్తున్న సీనియర్ నేతల కారణంగా పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని.. అందరిముందు నవ్వులపాలయ్యే దుస్థితి నెలకొందని అన్నారు. పార్టీ జాతీయ ప్రతినిధుల కమిటీ బుధవారం సమావేశమవుతుందని.. ఇందులోనే పార్టీలో నెలకొన్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలిపారు.

వివాదాలకు కారణమవుతున్న నేతలపై చర్యలకు సమావేశంలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గతవారం జరిగిన పార్టీ జాతీయ ప్రతినిధుల సమావేశంలో కన్వీనర్ పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ భావించారని.. కానీ సభ్యులు వారించడంతో వెనక్కి తగ్గారని సంజయ్‌సింగ్ వెల్లడించారు. ఏక వ్యక్తి కేంద్రకంగా ప్రచారం జరుగుతుండటం సరికాదని గత వారం జాతీయ ప్రతినిధుల కమిటీకి ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్ సంయుక్తంగా లేఖ రాయడంతో వివాదం రాజుకుంది. పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తున్నదన్న వార్తలను యోగేంద్రయాదవ్ కొట్టిపారేశారు. కుట్ర అనే మాటకు పార్టీలో స్థానమే లేదని మీడియాతో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: