యూరప్‌లోని ఓ గుర్తుతెలియని ప్రదేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండువారాలపాటు బౌద్ధానికి చెందిన విపాసన ధ్యానం చేయనున్నారని.. ఈ నెల 9న భారత్‌కు తిరిగి వస్తారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా, యూరప్ పర్యటనకు వెళ్లేముందు పార్టీలో చేయాల్సిన మార్పుచేర్పులపై రాహుల్‌గాంధీ పూర్తిస్థాయి నివేదికను సోనియాగాంధీకి ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటే తనకు సెలవు కావాలని కోరుతూ ఓ లేఖను జత చేసినట్లు తెలిసింది.

రాహుల్‌గాంధీ నివేదిక తయారీలో తన పాత ఓఎస్డీ.. ఇటీవల ప్రియాంకగాంధీ వద్ద ఓఎస్డీగా చేరిన కనిష్కసింగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టడం ఖాయమైనట్లు తెలుస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా ఏప్రిల్‌లోగానీ నవంబర్‌లోగానీ కాంగ్రెస్‌పార్టీ చీఫ్ మారే పరిస్థితులు కన్పిస్తున్నట్లు జాతీయ మీడియా జోస్యం చెప్తున్నది. సెప్టెంబర్‌తో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి సోనియాగాంధీ పదవీకాలం ముగుస్తుండటంతో.. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అంతర్గత ఎన్నికలతో రాహుల్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: