ప్రముఖ విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డిని సోమవారం కిడ్నాప్ చేశారన్న వార్త సంచలనం రేపింది. కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రాంతానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి బంధువులు, కేశవరెడ్డికి మధ్య ఉన్న లావాదేవీల విషయంమై ఆయనను నంద్యాల నుంచి బలవంతంగా వాహనంలో బనగానపల్లెకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నంద్యాల నుండి బనగానపల్లెకు వచ్చే అన్నిమార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేశారు.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బనగానపల్లెకు సమీపంలోని రౌండ్ల వద్ద ఓ వాహనంలో కేశవరెడ్డితో పాటు మరికొంత మంది రావడం గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బనగానపల్లె పోలీసులుస్టేషన్‌కు తరలించారు. నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డి బనగానపల్లె చేరుకుని కేశవరెడ్డితోపాటు వాహనంలో ఉన్న వారిని విచారించారు. అనంతరం నంద్యాల డిఎస్పీ హరినాథరెడ్డి మాట్లాడుతూ కేశవరెడ్డి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెబుతున్నా ఇందులో వాస్తవం లేదన్నారు. .

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి బనగానపల్లె, మదనపల్లె, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన పలువురి వద్ద అప్పు తీసుకున్నారని, ఆ అప్పుల సెటిల్‌మెంట్ విషయమై వారితో సోమవారం నంద్యాల శివారులో చర్చలు జరిపారన్నారు. బనగానపల్లె ప్రాంతానికి చెందినవారు కూడా ఈ చర్చలకు వెళ్ళారన్నారు. వారు తిరిగివస్తున్న తరుణంలో కేశవరెడ్డి కిడ్నాప్ అయ్యారన్న సమాచారంతో హై అలర్ట్ ప్రకటించామన్నారు. ఈక్రమంలో బనగానపల్లె శివారులో బనగానపల్లెకు చెందిన వ్యక్తుల వాహనంలో కేశవరెడ్డి కనిపించడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు.

కేశవరెడ్డిని వాహనంలో తరలించిన బనగానపల్లెకు చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా తాము కేశవరెడ్డిని కిడ్నాప్ చేయలేదని మాజీ ప్రజాప్రతినిధి బంధువులు స్పష్టం చేశారు. కాగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కేశవరెడ్డి ప్రకటించారు. తమ విద్యాసంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: