ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి జరిగిన అన్యాయం గురించి వివరించేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడే తెలంగాణలో పడ్డారు. ఇక్కడ తమ పార్టీని బలోపేతం చేయడం గురించి అయన దృష్టి సారించారు. తమ పార్టీ నేతలతో సమావేశం అవుతూ .. వారు పార్టీ వీడకుండా చూసుకొంటే.. భవిష్యత్తు లో తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపుతూ సాగుతున్నాడాయన.

ఇది వరకూ వరంగల్ లో పర్యటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కరీంనగర్ జిల్లా మీద దృష్టి సారించారు. ఈ జిల్లాలో పర్యటించి పార్టీ నేతలతో సమావేశం అవుతున్నాయన. అప్పుడప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వస్తుందని.. స్వయంగా తాను ఈ పనిని చేపడితే ఉపయోగం ఉంటుందని బాబు లెక్కలేసుకొంటున్నాడు.

ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లిపోతున్నారు. అధికారానికి దూరంగా ఉండలేని వారు అలా ముందుకు పోతున్నారు. తమ పదవిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నా కూడా.. వారు తెలుగుదేశం లో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బాబు తెలంగాణలో పార్టీపై దృష్టి సారించారు.

పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతూ.. వారిలో స్ఫూర్తి నింపడానికి బాబు ప్రయత్నిస్తున్నాడు. మరి బాబు తన పార్టీని ఉద్ధరించుకోవడాన్ని తప్పు పట్టలే కానీ.. ఏపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న సమయంలో బాబు ఇలా తెలంగాణ పర్యటనలు పెట్టుకోవడం కొంత విడ్డూరమే. ఆయనకు ముఖ్యమంత్రి పదవినిచ్చిన ఏపీ కన్నా.. తెలంగాణలోని పార్టీ పరిస్థితి మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: