వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులు, రైతు కూలీలతో ఆయన మాట్లాడతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు.

వారికి భరోసా కల్పించటానికే ఈ పర్యటన నిర్వహిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన మొదలవుతుందని చెప్పారు.

మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటన సాగుతుందన్నారు. అక్కడి నుంచి పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.

రైతులు రాజధాని నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతు కూలీల ఉపాధి సమస్యలు, పంట పొలాల సమస్యలు ఇలా అన్ని అంశాలపై అక్కడి ప్రజలతో మాట్లాడి తెలుసుకుంటారన్నారు. పర్యటన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి నుంచి గుంటూరు చేరుకొని పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడి అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: