జనసేన అధిపతి కదులుతున్నాడు. ఏపీ కొత్త రాజధాని నిర్మాణంతో నష్టపోతున్న రైతులతో చర్చలు జరుపుతానంటున్నాడు. పవన్ వెళుతోంది రైతులకు మద్దతుగా పోరాటం చేయడానికా? ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరపడానికా? రాజధాని ప్రాంతంలో ఇదే అయోమయాన్ని సృష్టిస్తోంది. రాజధాని ప్రాంతంలో తాను ఎందుకోసం పర్యటిస్తానన్నది పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా అది ఆయనకే ఇబ్బందికరంగానే మారనుంది. ఇంకా చెప్పాలంటే ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లయ్యింది పవర్ స్టార్ పరిస్థితి.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం భారీగా భూములు సేకరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సిరులు కురిపించే మాగాణులను వదులుకునేది లేదంటూ ఎంతో మంది రైతులు నిరసనలకు దిగారు. తమకు రాజధాని వద్దంటూ ఆందోళన బాట పట్టారు. భూములు తీసుకోవడం ఖాయమే అంటున్న ప్రభుత్వం మాత్రం రైతుల అభ్యంతరాలను ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. సమీకరణకు సహకరిస్తే సరే లేదంటే సేకరణే అంటూ భయపెడుతోంది. దీనిపై ఇప్పటికే కోర్టు మెట్లెక్కారు రాజధాని వ్యతిరేక రైతులు. భూసమీకరణ గడువు కూడా పూర్తికావడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలయ్యింది. ఈ సమయంలోనే ఈ అంశంపై స్పందించారు జనసేన అధినేత, సినీ పవర్-స్టార్ పవన్ కళ్యాణ్. రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందంటూ ప్రకటించారు. దీని తర్వాత గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ రావాలంటూ రైతులు ఆందోళనకూ దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ కావడం, ఈ నెల 5న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానంటూ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

పవన్ కళ్యాణ్ ప్రకటన బాగానే ఉన్నా ఇప్పుడు ఆయన ఏ స్టాండ్ తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. రైతుల జీవనం ధ్వంసం కాకూడదంటే రాజధానిని వ్యతిరేకించాలి. అంటే టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. రాజధానిని వ్యతిరేకిస్తున్న రైతుల భూములను ప్రభుత్వం సమీకరించకుండా అడ్డుపడాలి. ఓ రకంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దానికి సిద్ధమేనా?

ఈ పర్యటనకు ముందే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యపైనా ఈ భేటీలో చర్చకు వచ్చింది. వీరిద్దరి భేటీ సానుకూలంగానే సాగినట్లు కనిపిస్తోంది. అలాంటప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఆయన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు తక్కువే. మరోవైపు భూములు ఇవ్వని రైతులను ఒప్పించే దిశగా పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతారన్న ప్రచారమూ సాగుతోంది. ఇదే రైతుల్లో ఆందోళన పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: