తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షునిగా నియమితులైన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనీసం పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే వ్యతిరేకత ప్రారంభమైంది. ఒకరిద్దరు బహిరంగంగా వ్యతిరేకించినా, చాలామంది మీడియా ముందు ఆప్ ది రికార్డుగా మాట్లాడుతున్నారు. బిసి నాయకుడైన పొన్నాల లక్ష్మయ్యను తొలగించి ఆ స్థానంలో తిరిగి బిసి నాయకున్ని నియమించకపోవడం పట్ల ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు సోమవారం తీవ్ర అభ్యంతరం తెలిపారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న బిసిలకు అన్యాయం చేయడమేనని ఆయన విమర్శించారు. కాగా మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బహిరంగంగా కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించడాన్ని తప్పుపట్టారు.

పార్టీ అధిష్ఠానం రెండో సారి మళ్లీ తప్పు చేసిందని ఆయన విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టి.పిసిసి అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించి మొదటి తప్పు చేసిందని, ఇప్పుడు ఉత్తమ్‌ను నియమించి రెండోసారి తప్పు చేసిందని ఆయన విమర్శించారు. పొన్నాల టి.పిసిసి అధ్యక్షునిగా ఉన్నంతవరకూ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ మెట్లు ఎక్కలేదని ఆయన తెలిపారు. ఉత్తమ్‌ను నియమించడానికి ముందు అధిష్ఠానం కనీసం తమను సంప్రదించలేదని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్ఠానం టి.పిసిసిని ఎలా నడిపిస్తుందో చూద్దాం అని అన్నారు. పిసిసి నూతన సారథి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరిస్తారా? అని ప్రశ్నించగా, ‘ఎందుకు సహకరించాలి?’ అని కోమటిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. పార్టీలో ఇంకా అనేకమంది నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉత్తమ్ సామాజికవర్గానికి చెందిన వారు కూడా వ్యతిరేకించడం గమనార్హం.

ఇలాఉండగా వెనుకబడిన కులాలకు చెందిన నాయకులు అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బిసి నేతను తప్పించినందున, తిరిగి బిసికే ఇవ్వకపోవడం వల్ల పార్టీకి బిసిలు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. టి.పిసిసి అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్య సాధించలేనిది ఇప్పుడు ఉత్తమ్ ఏమి సాధిస్తారని అంటున్నారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఒక సామాజికవర్గానికి ఇస్తుందన్న ప్రచారానికి ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందని బిసి నాయకులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దళితులను సంతృప్తిపరిచేందుకు మల్లు భట్టివిక్రమార్కకు టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

టి.పిసిసి పగ్గాలను కెప్టెన్ ఉత్తమ్‌కు అప్పగించడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనలకు పార్టీ ఏమని సమాధానం చెబుతుంది?, నాలుగు రోజుల పాటు ఆందోళనలు చేసి తర్వాత వౌనంగా ఉండిపోతారని భావిస్తున్నదా? అని నాయకులు చర్చించుకుంటున్నారు. తాత్కాలికంగా సమిసిపోయినా, పార్టీని ఒక్క తాటిపై ఉత్తమ్ నడిపించలేకపోతే, మళ్లీ భగ్గుమంటాయని, అప్పుడు పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుంది కదా అని సీనియర్ నాయకుల మనోవేదన.

మరింత సమాచారం తెలుసుకోండి: