రాష్ట్ర ఖజానాకు పెట్రో ఉత్పత్తులు భారీగా దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ అమ్మకాలు మరింత దారుణంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు 1.50 రూపాయల నుంచి రెండు రూపాయల వరకు ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్ధికశాఖ అధికారులు అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు కూడా ఎక్కువగా తెలంగాణలో డీజిల్ కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

చివరకు ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి పెట్రోల్ వాహనాలు కూడా సుదీర్ఘ ప్రయాణాలు చేసే సమయంలో తెలంగాణ బంకుల్లోనే పెట్రోల్ పోయించుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. దీనివల్ల ఆంధ్రాలో కన్నా తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరుగుతూ ఆంధ్రకు ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తుండగా, తెలంగాణకు అదనపు రాబడిని పెంచుతున్నాయి. జాతీయ రహదారిపై ఆంధ్రానుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలు ముందుగా నామమాత్రంగా డీజిల్‌ను ఆంధ్రాలో పోయించుకుంటూ, పెద్ద మొత్తంలో డీజిల్‌కు తెలంగాణ బంకులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఆంధ్రాకు చేరే సమయానికి ట్యాంకులు నిండిఉండేలా చూసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఇదే ఎపి ఖజానాకు చిల్లు పడేందుకు కారణంగా ఉంటున్నట్లు సమాచారం.జనవరి, ఫిబ్రవరిలో డీజిల్‌పై రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో భారీగా తగ్గుదల ఉన్నట్లు వాణిజ్య పన్నులశాఖ అధికారులు విశే్లషిస్తున్నారు. జనవరిలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై 646 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, 503 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఫిబ్రవరిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించగా, తెలంగాణ ప్రభుత్వం అదే మొత్తాన్ని వ్యాట్ రూపంలో పెంచుకుంది. కొద్ది రోజుల తరువాత మేలుకున్న ఆంధ్ర అధికారులు కూడా వ్యాట్‌ను పెంచారు. అయితే ఇరు రాష్ట్రాల పెంపులో ఉన్న స్వల్ప వ్యత్యాసం వల్ల తెలంగాణకన్నా ఆంధ్రలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి.

చిన్న చిన్న వాహనాలను వదిలిపెడితే ఒకేసారి భారీ మొత్తంలో, వందల లీటర్లలో డీజిల్ నింపుకొనే లారీలు, ట్రక్కర్లు, బస్సులు వంటి వారు ఆంధ్రాలోకన్నా తెలంగాణలోనే ఎక్కువగా డీజిల్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే భారీ ఆర్థిక నష్టానికి కారణంగా భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై గతంలోనే ఆర్ధికశాఖకు, వాణిజ్య పన్నులశాఖకు మధ్య చర్చలు జరిగినా సకాలంలోనే మేలుకోకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ప్రారంభమైనట్లు వారు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టాలన్న ఆలోచనకు ఆర్థిక శాఖ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: