ఆంధ్రా, తెలంగాణ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడిన నాటి నుంచే ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా కృష్ణా జలాల పంపకం, విద్యుత్ పంపకం వంటి ఇష్యూలు రెండు ప్రాంతాల వారి మధ్య విబేధాలు సృష్టించాయి. చివరకు సాగర్ జలాల విషయంలో రెండు రాష్ట్రాలు పోలీసులను భారీ ఎత్తున మోహరించి యుద్ధవాతావరణం ఏర్పడింది కూడా. దేశంలో ఏ రెండు రాష్ట్రాలకూ లేనంతగా వందల కిలోమీటర్ల దూరం ఓ నది సరిహద్దుగా ఉండటం వివాదాలకు కారణమైంది.

ప్రస్తుతానికి గొడవలు సద్దుమణిగినా.. అవి మళ్లీ పెచ్చరిల్లవన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు కరీంనగర్ పర్యటనలో భలే విశేషాలు చోటుచేసుకున్నాయి. నిత్యం టీఆర్ఎస్ పై విరుచుకుపడే చంద్రబాబు.. కరీంనగర్ సభలో విమర్సలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మంచి విషయాలు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఊరికే గొడవ పడితే ఫలితం ఏమీ ఉండదని... కలసి అభివృద్ధి చెందుదామని ఆయన పిలుపునిచ్చారు.

రెండు రాష్ట్రాల మధ్య గొడవల విషయంలో పరిష్కారం కోసం తాను అనేక సార్లు చొరవ తీసుకున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నాగార్జన సాగర్ వివాదం సమయంలో తానే చొరవ తీసుకుని కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. కరెంట్ విషయంలోనూ కలసి చర్చించుకుందామని కేసీఆర్ కు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందుతామని బంగారం లాంటి మాట చెప్పారు.

అంతేకాదు.. కరీంనగర్ పర్యటనలో ఇంకో విశేషం చోటుచేసుకుంది. తెలుగుదేశం బహిరంగ సభల్లో చంద్రబాబు జై తెలుగుదేశం.. జై జన్మభూమి నినాదాలు చేయించడం అలవాటే.. కానీ ఈ కరంనగర్ సభలో కొత్త చంద్రబాబు తెలంగాణ పాట పాడారు. సభ చివర్లో జై తెలంగాణ నినాదాలు చేశారు. కార్యకర్తలతో చేయించారు. మరి తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండాలంటే ఆ మాత్రం నినాదాలు చేయక తప్పదుకదా.. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. అని విమర్శకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: