ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లి మోడీ, జైట్లీని కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

ఇక నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులో ఉగాది ఉత్సవాలను జరపాలని నిర్ణయించారు. రాజధాని భూసమీకరణకు సహకరించినందుకు గానూ మార్చి 21న తుళ్లూరులోనే రైతుల అభినందన సభ ఏర్పాటుచేయాలని మంత్రివర్గం తీర్మానించింది. వేసవికాలంలో పశుగ్రాసం కొరత లేకుండా ప్రభుత్వమే మూడు రూపాయలకు కిలో చొప్పున పశుగ్రాసం పంపిణీచేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, కరువు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ప్రతి జిల్లాలో లక్ష ఎకరాల చొప్పున ల్యాండ్‌ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం గత ప్రభుత్వాలు కేటాయించిన భూములు ఖాళీగా ఉన్నట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపాలీటీలను సుందరీకరణ వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ దాదాపు ఏడు గంటలపాటు కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: