తెలంగాణలో చంద్రబాబు రెండో పర్యటన కూడా విజయవంతంగానే సాగింది. మొదట వరంగల్ సభ.. ఇప్పుడు కరీంనగర్ సభ.. రెండు సభలూ ఎలాంటి అవాంతరాలు లేకుండా.. విజయవంతంగా నిర్వహించడంతో ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఆనందం వారి మాటల్లోనూ కనిపిస్తోంది.

సభలు బాగా జరిగిన ఆనందమో.. బాబును మెప్పించాలన్న ఆత్రుతో తెలియదు కానీ.. వరంగల్, కరీంనగర్ సభల్లో కొందరు టీడీపీ నాయకులు.. టీఆర్ఎస్ నాయకును వ్యక్తిగతంగా విమర్శించారు. అసలే టీడీపీ సభలు సక్సస్ అవుతున్నాయన్న ఆగ్రహంతో ఉన్న గులాబీనేతలకు.. ఈ ప్రసంగాలు అస్సలు రుచించడం లేదు. అందులోనూ... తెలంగాణ కల సాకారమైనా ఇంకా కొందరు తెలంగాణ నేతల్లో ఇంకా ఉద్యమ ఆవేశం తగ్గినట్టు లేదు. ఇంకా తరిమికొడతాం.. నాలుకలు కోస్తాం.. వంటి పదజాలం ఇంకా వాడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో రసమయి బాలకిషన్ ఒకరు.

తెలుగుదేశం నేతల ప్రసంగాలపై ఆయన హైదరాబాద్ లో మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడితే టీడీపీ నేతల నాలుకలు కోస్తామని ఆయన ఆవేశంగా అన్నారు. చంద్రబాబు యాత్రపైనా విమర్శలు చేసిన రసమయి... బాబు తెలంగాణను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను తాము పట్టించుకోలేదని రసమయి చెబుతున్నారు. తాము తలచుకుంటే అసలు బాబు కరీంనగర్ లో అడుగుపెట్టేవారే కాదంటున్నారు. చంద్రబాబును తరిమికొట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, మరోసారి అవసరమైతే తరిమికొడతామని రసమయి వార్నింగ్ ఇచ్చారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం వరకూ ఓకే. కానీ.. ఇంకా నాలుకలు కోస్తామని హెచ్చరించడం ఏమాత్రం బాగోలేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: