చంద్రబాబు-మోడీ జోడీ గతఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీకి నిధులే నిధులని అంతా సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 9 నెలల పాలన పూర్తికాకుండానే భ్రమలు తొలగిపోతున్నాయి. కేంద్రం అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతుంటే.. ఏంచేయాలో దిక్కుతోచక చంద్రబాబు అయోమయంలో పడిపోతున్నారు. మింగలేక కక్కలేక.. ఏం చేయాలా అని వ్యూహాలు రచిస్తున్నారు.

టీడీపీ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బడ్జెట్ రూపంలో మంచి అవకాశం చిక్కినా దాన్ని వైసీపీ సరిగ్గా ఉపయోగించుకుంటున్నట్టు కనిపించడంలేదు. బడ్జెట్, రైల్వే బడ్జెట్, ఆర్థిక సంఘం సిఫార్సులు, ప్రత్యేక హోదా.. ఇలా అన్ని విషయాల్లోనూ ఏపీకి అన్యాయం జరుగుతున్నా వైసీపీ పెద్దగా స్పందించడం లేదు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఈ విషయంపై నేరుగా స్పందించలేదు.

తాజాగా.. ఆ పార్టీ అధికార ప్రతినిధి బత్తులు బ్రహ్మానందరెడ్డి.. ఈ అన్యాయంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా టీడీపీ రాష్ట్రానికేమీ తెచ్చిపెట్టలేకపోయిందని విమర్శించారు తప్ప.. కేంద్రంపై నేరుగా విమర్శలు చేయలేదు. బ్రహ్మానందరెడ్డి.. వంటి చిన్నాచితకా లీడర్లు ఈ విషయంపై స్పందించడం తప్ప.. ప్రతిపక్షనేత మాత్రం నేరుగా.. గట్టిగా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెదవి విప్పడం లేదు.

మిత్రపక్షంగా ఉన్నా టీడీపీ నేతలు ఈ విషయంలో కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు వద్దని వారిస్తున్నా.. అప్పుడప్పుడూ బాలయ్య వంటి నేతలు హద్దులుమీరుతున్నారు. అలాంటిది జగన్ మౌనం ఆ పార్టీనేతలకే మింగుడుపడటం లేదు. కేంద్రాన్ని విమర్శించి అనవసరంగా బీజేపీతో ఎందుకు తలనొప్పులు తెచ్చుకోవడం అనుకుంటున్నారో.. లేక.. టీడీపీని మాత్రమే విమర్శించాలని నిర్ణయం తీసుకున్నారో తెలియదు గానీ... ఈ పరిస్థితి ఆ పార్టీకి అంతగా లాభించకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని వదలుకుని.. ఆనక చింతించే అలవాటు ఆ పార్టీ మానకుంటే మంచిదంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: