ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనే ప్రచారం జరగడం పట్ల తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. టీడీపీలో అనేక మంది సీనియర్లు ఉంటే... నిన్న కాక మొన్న వచ్చిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తీవ్రంగా విమర్శించిన జూపూడి ఇప్పుడు టీడీపీ పంచన చేరి పదవులను దక్కించుకోవాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని పలువురు స్పష్టం చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొని పదేళ్ల్ల పాటు పార్టీని నమ్ముకొని పలువురు నాయకులు ఉన్నారని, వారికి కాదని ఎమ్మెల్సీ పదవి జూపూడికి ఇవ్వడం ఏమిటని పెదవి విరుస్తున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ రేసులో టీడీపీ సీనియర్‌ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలు ఉన్న విషయం విధితమే.

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన జూపూడి ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అసలు ఆయన పార్టీలో చేరిన విష యం కూడా చాలా మందికి తెలియదు. వైసీపీలో ఉన్న సమయంలో కూడా జూపూడి ఎమ్మెల్సీ పదవిని అనుభవించారు. చివరి క్షణంలో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అటువంటి నాయకుడికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనే ప్రచారం జరగడం విశేషం. నిజంగా జూపూడికి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తుందో లేదో తెలియదు కానీ... కొందరు మాత్రం పని కట్టుకొని ప్రచారం చేస్తుండడం గమనార్హం. జూపూడీకి ఏ ప్రాదిపదికన ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే విషయం ఇప్పుడు పెద్ద చర్చానీయంశమైంది. కొత్తగా వచ్చిన వారందరికీ ఇలా పదవులు ఇచ్చుకుంటూ వెళితే పార్టీలో పని చేస్తున్నా వారి పరిస్థితి ఏమిటని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. దీని పై గ త కొంత కాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఆంశం పై అధిష్టానం కసరత్తు చేస్తోంది.

పైగా రాష్ర్టం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఎమ్మెల్సీ స్థానాలు పెరగడంతో జిల్లా నుంచి ఒకరికి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే తొలి నుంచి కరణం బలరామకృష్ణమూర్తి పేరు విన్పిస్తోంది. దీని పై అధి ష్టానం పై కూడా సూచన ప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి జూపూడికి ఇచ్చే అకాశం ఉందని ప్రచారం జరగడం వెనుక అంతర్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక కొందరు తెరవెనుక కథ నడిపిస్తూ... ప్రచారం చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.జూపూడీ ప్రభాకర్‌ మొదటి నుంచి ప్రత్యక్షంగా ప్రజల్లో తిరిగిన సందర్భాలు లేవు. వైసీపీలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ పదవి ఉన్నా... ఆ పార్టీ అధినేత జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీలో కీలక పాత్ర పోషించారు

. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొండెపి నుంచి పోటీ చేసిన జూపూడి ఓటమి పాలైయ్యారు. అయితే తన ఓటమికి బాలినేని శ్రీనివాసరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలే కారణమంటూ బహిరంగంగానే ఆరోపించారు. జగన్‌ పై సైతం పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో సైతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు.... ఇప్పుడేమి చేస్తున్నాడనే విమర్శలు మాత్రం ప్రజల్లో విన్పిస్తున్నాయి. అటువంటి నాయకుడికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఏమిటని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. దీని పై టీడీపీలోని సీనియర్లు సమావేశం అయి, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: