ఎన్నికలు అయ్యాకా నెలలు గడిచిపోయాక కానీ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు ఒక కొలిక్కి రాలేదు. ఎట్టకేలకూ అక్కడ ప్రభుత్వం ఏర్పడింది.. భారతీయ జనతా పార్టీ, పీడీపీలు ఉమ్మడిగా అధికారాన్ని దక్కించుకొన్నాయి.. అనుకొంటే ఇప్పుడు అక్కడ రోజుకొక గొడవ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ తన వ్యాఖ్యానాలతో భారతీయ జనతా పార్టీని ఇబ్బందులు పెట్టాడు.

కాశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం వెనుక ఘనత ఉగ్రవాదులదే అనడం.. పార్లమెంటుపై దాడి కేసులో ఉరి తీయబడ్డ ఉగ్రవాదిని పీడీపీ వారు పొగడటం.. అతడి అస్తికలను అప్పగించాలని డిమాండ్ చేయడం వంటి వ్యవహారాలతో పీడీపీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టింది. ఈ అంశాల్లో భారతీయ జనత పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల వి పరస్పర భిన్నాభిప్రాయాలయ్యాయి.

ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయిన పీపుల్స్ కాన్ఫరెన్స్ తన అసంతృప్తిని ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే సజ్జద్ లోన్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ, పీడీపీలపై విరుచుకుపడ్డాడు. మంత్రి పదవులు కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీడీపీతో దోస్తీ కుదిరాకా భారతీయ జనతా పార్టీకి తమ విలువ తెలియకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించాడు.

ఇలా ఉన్నాయి కాశ్మీర్ రాజకీయాలు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న భారతీయ జనతా పార్టీ ఇలా అపసోపాలు పడుతోంది. మరి ఇలాంటి కాపురం ఎన్ని రోజులు కొనసాగుతుందో అర్థం కావడం లేదు. ఇలాంటి రచ్చలే గనుక తీవ్రం అయితే ఇక్కడ ప్రభుత్వం కుప్ప కూలినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: