కాంగ్రెస్ యువరాజు నిజంగా కన్నెర్ర చేస్తున్నట్లుగానే ఉంది. లీవ్ పేరుతో అజ్ఞాతంలో ఉన్న రాహుల్ గాంధీ..పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు మరింత పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను ఉన్నపళంగా ఖాళీ చేయించిన అధిష్టానం..ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. కేంద్రంలో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా..లీవ్ లో ఉన్న రాహుల్, ఎక్కడికెళ్లారో..ఏం చేస్తున్నారో అనుకుంటున్న పార్టీ వర్గాలకు షాకులమీద షాకులు తగులుతున్నాయి. అజ్ఞాతంలో ఉన్న రాహుల్.. అక్కడినుంచే పార్టీని చక్కబెట్టే పనిలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే.. ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ల మార్పు జరిగిందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు. .మరో ఎనిమిది రాష్ట్రాలపై ఇప్పుడు దృష్టి పెట్టింది. వీటిలో దాదాపు 5రాష్ట్రాల పీసీసీల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ, సీడబ్ల్యుసీ సభ్యులతో ఉన్న సంబంధాల వల్ల కొంత వత్తిడి ఉన్నప్పటికీ..ప్రక్షాళనే లక్ష్యంగా కసరత్తు సాగుతోంది. దీనికి నిదర్శనంగా...ఇంతకు ముందు రాహుల్ గాంధీ ఏరికోరి ఎంపికచేసిన పంజాబ్ పీసీసీ చీఫ్ పీఎస్ భజ్వాని పక్కక తప్పించడాన్నే ప్రముఖంగా చెబుతున్నారు.

ప్రజలతో సంబంధాలు, నేతలందరినీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం, వర్గాలను ప్రోత్సహించని వైఖరి, గత ఎన్నికల ట్రాక్ రికార్డ్ ఆధారంగా పీసీసీల పనితీరును బేరీజు వేస్తోంది హైకమాండ్. ఇప్పుడు సాగుతున్న ప్రక్షాళన మొత్తం...షేక్ అప్-మేక్ అప్ అన్న పద్ధతిలో సాగుతోంది. మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన రిక్రూట్మెంట్ స్కాంలో సీఎంని మరింత టార్గెట్ చేసేందుకు వీలుగా ఇప్పుడున్న అరుణ్ యాదవ్ స్థానంలో మరింత అనుభవజ్ఞుడైన నేత కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక, హర్యానాలో పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వర్పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు ఏఐసీసీ గుర్తించింది. కర్ణాటకలోనైతే...పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ కు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలున్న తరుణంలో...పీసీసీ సారథ్య బాధ్యతలు, నిర్మల్ ఖత్రి దగ్గర ఉంచడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, బీహార్ పీసీసీ చీఫ్ అశోక్ చౌదరి..దళిత్ కార్డు ప్రయోగిస్తుండడంతో..స్థానచలనం ఉండకపోవచ్చంటున్నారు.

ఈ రాష్ట్రాలన్నింటితో పోలిస్తే..రాజస్థాన్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు అధిష్టానం భావిస్తోంది. రాజస్థాన పీసీసీ సారథి సచిన్ పైలట్...ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఫర్వాలేదనిపించారు. స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగైంది. అశోక్ గెహ్లాట్, సీపీ జోషీ వంటి సీనియర్ నేతలతో పైలట్కు ఉన్న సంబంధాల రీత్యా చూసినా..రాజస్థాన్ పీసీసీకి అధిష్టానం ఓకే చెబుతుందంటున్నారు. ఇక, కేరళ విషయానికి వస్తే...పీసీసీ చీఫ్ సుధీరన్కు మరికొంత గడువు ఇచ్చే సూచనలున్నాయి. ఉమన్ చాందీ, రమేష్ చెన్నితాలా వంటి సీనియర్ నేతలతో సుధీరన్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే ఎన్నికలు జరిగిన జార్ఖండ్ కాంగ్రెస్కు కూడా మరింత నమ్మకస్తుడైన నాయకుడి కోసం చూస్తోంది...ఏఐసీసీ!...స్పాట్

ఏప్రిల్ నాటికి..రాష్ట్రాలన్నీ ఒక గాడిలో పడితే, యువరాజు పట్టాభిషేకాన్ని..ధూంధాంగా నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి...యువరాజా వారు అండర్ గ్రౌండ్ లో ఉండగానే...పీసీసీల ప్రక్షాళన ఊపందుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: