పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా కుదుపుకులోనయ్యాయి. ఇన్నాళ్లుగా ఉన్న సమీకరణలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వరకూ బీజేపీ, టీడీపీలను భుజాన మోసిన పవన్ ఇప్పుడు ఒక్కసారిగా రెబల్ స్టార్ గా మారిపోయారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. రాజకీయాన్ని రసకందాయంలో పడేశాడు.

ఇంతకీ పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి.. చంద్రబాబు అనుచరుడుగా ఉంటూ వస్తున్న పవన్ ఎందుకు ఒక్కసారిగా జలక్ ఇచ్చాడు..? ఇప్పుడు పవన్ భవితవ్యం ఏంటి.. సర్కారుపై ఇదే వ్యతిరేకత కొనసాగిస్తాడా.. ? పార్టీని బలోపేతం చేసుకునేందుకే జనసేనాని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడా.. అన్న సస్పెన్స్ అందిరిలోనూ ఉంది.

రాజధాని ప్రాంత రైతుల్లో వ్యతిరేకత ఉన్న మాట నిజం. అచ్చమైన రైతునని చెప్పుకుంటున్న పవన్.. వారి కోసం పోరాడతానంటూ వారిని ఆకట్టుకుంటున్నాడు. రాజధాని ప్రాంతంలో ఒకరోజు పర్యటనలోనూ ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రజలను ఆకట్టుకుంది. ప్రజల్లో కలసిపోవడం. మోకాళ్లపై కూర్చోవడం, వారి పెట్టింది ఆప్యాయంగా తినడం.. ఇవన్నీ పవన్ మనలో ఒకడు అనే ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.

రాజకీయాలంటే హైదరాబాద్ లో కూర్చుని వ్యూహాలు రచించడం కాకుండా..జనంలోకి వెళ్లి..వారి మధ్యనే తిరిగి.. వారి అభిమానం సంపాదించడం.. మొన్నటి ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ చేసింది కూడా అదే. మరి పవన్ ఆ స్థాయిలో బలపడాలంటే.. ఇప్పటి నుంచే ఆ వ్యూహాలు రచించాలి. బహుశా.. ఈ తుళ్లూరు పర్యటనతో పవన్ దానికి శ్రీకారం పలికినట్టైతే.. జనసేనకు మంచిరోజులు వచ్చినట్టే.. అలాకాకుండా.. సినిమా షూటింగులా.. ఆరునెలలకో ఏడాది ఓసారి వస్తానంటే.. జనం అంత సులభంగా నమ్మరు. చంద్రబాబు ప్రభుత్వంపై క్రమంగా మొదలవుతున్న వ్యతిరేకతను పవన్ వాడుకోగలిగితే.. అదే జనసేనను నడిపించే ఇంధనం అవుతుంది. మరి పవన్ ఆ రూట్లో వెళ్తారా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: