రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ నేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యాలు కేవలం సూచనలు మాత్రమేనని, ఆరోపణలు ఎంత మాత్రం కాదని సమాచార మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని అన్నారు. ఆయన రైతులతో మాట్లాడిన తర్వాత కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారని, దాంట్లో తప్పులేదని అన్నారు. ఏ రైతు నుండి ఈ ప్రభుత్వం ఎన్నడూ బలవంతంగా భూమిని తీసుకునేది లేదని, రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని అప్పగించారని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 32వేల ఎకరాల భూమిని రైతులు ముందుకు వచ్చి మెచ్చి ఇచ్చిన పరిస్థితి లేదని రఘునాధరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచప్రఖ్యాత రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వం సన్నాహాలు చెస్తోందని అన్నారు. కేవలం నేటి అవసరాలకే కాకుండా రానున్న 50-100 ఏళ్ల అవసరాలకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తాము రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు.

అలాగే గతంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసి తీరుతామని, రుణ మాఫీని దశల వారీ అమలుచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 22.79 లక్షల మందికి రుణ విమోచన కల్పించామని, మరో ఏడు లక్షల మందికి రుణ విమోచన కల్పించాల్సి ఉందని చెప్పారు.

అనుమానాలుంటే నివృత్తి చేస్తాం రాష్ట్రం ఈ రోజు ఆర్ధిక ఇబ్బందులకు , సౌకర్యాల లేమికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రం 16వేల కోట్ల రూపాయిల లోటు బడ్జెట్‌కు చేరిందని, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రప్రభుత్వం అందుకు నిధులు సరిపడా ఇవ్వలేదని అన్నారు. విద్యుత్, జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కొట్లాటలు జరిగినా వాటి పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం నడవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు పార్లమెంటు నుండి సిక్స్ పాయింట్ ఫార్ములా తెచ్చారని కాని రాజశేఖరరెడ్డి వచ్చి ఎమ్మెల్యేలతో వత్తిడి చేసి ఫార్ములా 3 తెచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన కోసం వైకాపా అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మద్దతు ఇచ్చి ఆర్ధికంగా దెబ్బతిన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎలాంటి దురుద్ధేశాలు లేవని, పవన్‌కు అనుమానాలుంటే వాటిని నివృత్తి చేస్తామని గాలి చెప్పారు. విభజన సమస్యలపై బాబును కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: